నలుగురి దుర్మరణం
వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
బుక్కపట్నం : మండలంలో ఆదివారం రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గశికవారిపల్లి సమీపంలో రాళ్లు కొట్టేందుకు వెళ్లిన ముదిగుబ్బకు చెందిన పెచ్చల రమణ (30) ప్రమాదవ శాత్తు రాయి మీద పడి మృతి చెందాడు. మరో ప్రమాదంలో బుక్కపట్నానికి చెందిన బోయ అంజి (38) బేల్దారి కొత్తచెరువు మండలం నారేపల్లిలో మొహర్రం ముగించుకుని బైక్‌లో బుక్కపట్నం వస్తుండగా కడపనాగేపల్లి, బుచ్చయ్యగారిపల్లి మధ్యలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతడిని ఆస్పత్రి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సంకేపల్లి క్రాస్ సమీపంలో వేంపల్లె వాసి..
ముదిగుబ్బ : సంకేపల్లి క్రాస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేంపల్లికి చెందిన కోనేటి ఆంజనేయులు (34) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. కోనేటి ఆంజనేయులు సంకేపల్లి క్రాస్‌లో తన నర్సరీ వద్ద నుంచి తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో ముదిగుబ్బవైపు వెళ్తుండగా కదిరివైపు నుంచి వస్తున్న టాటా మ్యాజిక్ కారు ఢీకొనింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఎస్‌ఐ జయానాయక్ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి పంపారు.
గుత్తిలో వృద్ధురాలు..
గుత్తి: స్థానిక చెరువు బ్రిడ్జి కట్టపై ఆటో అదుపు తప్పిన ప్రమాదంలో విడపనకల్లు మండలం గడేకల్‌కు చెందిన సుంకమ్మ(68) అక్కడికక్కడే మరణించింది. అదే గ్రామానికి చెందిన లింగమ్మ, గుత్తి చెర్లోపల్లి కాలనీకి చెందిన ఎరికల రోగన్న, బాచుపల్లికి చెందిన గిడ్డమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గొల్లలదొడ్డికి చెందిన ఆటో గుత్తి నుంచి గుంతకల్లుకు ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలో గుత్తి చెరువు కట్టకు ఎదురుగానున్న బ్రిడ్జి కట్టపై ప్రయాణిస్తుండగా ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జి పక్కన ఉన్న వరి మడుల్లో బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ మ««దlుసూదన్ గౌడ్, ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ చలమయ్య తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బ్రాహ్మణపల్లి సమీపంలో మరో ముగ్గురికి గాయాలు
సోమందేపల్లి : మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఆదివారం రెండు బైక్‌లు పరస్పరం ఢీకొని ముగ్గురు గాయపడ్డారని ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. సోమందేపల్లి వైపు నుంచి కేతగానిచెరువుకు బైక్‌లో బయలుదేరిన వెంకటేశులు, నారాయణప్పను మోతుకుపల్లి నుంచి ఈదుళబళ్లాపురానికి బయలుదేరి ఎదురొచ్చిన నల్లప్ప అనే మరో స్కూటరిస్టు ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారన్నారు. వారిని హిందూపురం ఆస్పత్రికి తరలంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.