బోల్తాకొట్టిన ఆటోను లారీ ఢీకొట్టడంతో..
మేడికొండూరు(గుంటూరు జిల్లా)
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ బోల్తాపడిన ఆటోను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో ఆదివారం జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రోలగంపాడు గ్రామానికి చెందిన మేండ్రగుత్తి కల్యాణ్, పి.వెంకట కాశీసాయిరామ్, రెహమాన్ విద్యార్థులు. వీరిలో కల్యాణ్, సాయిరామ్ మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.
ఆదివారం జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షకు వీరికి పెదపలకలూరు విజ్ఞాన్ కళాశాలను సెంటర్‌గా కేటాయించారు. దీంతో ముగ్గురూ ఒకరోజు ముందుగా శనివారమే ఫిరంగిపురంలో ఉన్న కల్యాణ్ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రానికి ఆటోలో బయలుదేరారు. డోకిపర్రు శివారులోని జోసిల్ కంపెనీ వద్దకు రాగానే ఆటోకు శునకం అడ్డురాగా అదుపుతప్పి బోల్తాకొట్టింది. అదే సమయంలో పేరేచర్ల నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న లారీ.. బోల్తాకొట్టిన ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న కల్యాణ్, సాయిరామ్ ఘటన స్థలంలోనే మత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన రెహమాన్‌ను, ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిల్లి ఏసోబును గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు కూడా చికిత్స పొందుతూ మరణించారు. ఘటన స్థలాన్ని గుంటూరు సౌత్ డివిజన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిశీలించారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.