రూ.5కోట్లు స్వాహా! | frading in wages payment | Sakshi
Sakshi News home page

రూ.5కోట్లు స్వాహా!

Published Sat, Aug 20 2016 11:20 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

frading in wages payment

  • వీసీవోల వేతనాలందుకుంటున్న కారోబార్లు, ఆశావర్కర్లు, ఆర్‌ఎంపీలు
  • 300 మందికిపైగా వీసీవోల వేతనాలు ఇతరుల ఖాతాల్లోకి...
  • ఇప్పటికే రూ.3లక్షల మేరకు రికవరీ చేసిన అధికారులు
  • వేతనాల స్వాహాపై సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశం
  • సహకార  ఆడిట్‌ అధికారి అంబయ్య విచారణ షురూ..
  • వయోజన విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల పరిశీలన
  • నేర్పని అక్షరానికి నేడు లక్ష మందికి పరీక్ష
  • వయోజన విద్యాశాఖ తీరుపై సర్వత్రా విస్మయం
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : జిల్లా వయోజన విద్యాశాఖ తీరు విస్మయం కలిగిస్తోంది. ఆ శాఖలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. విలేజ్‌ కో ఆర్డినేటర్‌(వీసీవో)ల వేతనాలు పెద్ద ఎత్తున పక్కదారిపడుతున్నాయి. గ్రామాల్లోని కారోబార్లు, ఆశావర్కర్లు, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌(సీఆర్‌పీ)లు వీసీవోల అవతారమెత్తి వారి వేతనాలను స్వాహా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 300 మంది వీసీవోల పేరిట ఏటా రూ.75 లక్షలు తమ జేబుల్లో వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇది చాలదన్నట్లుగా వయోజన విద్యాశాఖలో మరికొందరు ఉద్యోగులు వీసీవోల వేతనాలను మింగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ అంతర్గత విచారణలో వీసీవోల వేతనాలు ఇతర సిబ్బంది ఖాతాల్లో పడుతున్న విషయం తెలియడంతో బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటివరకు పక్కదారి పట్టిన వేతనాల్లో సుమారు రూ.3 లక్షల వరకు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేసే పనిలో పడ్డారు. వీసీవోల వేతనాల స్వాహా విషయం కలెక్టర్‌ నీతూప్రసాద్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా సహకార అధికారి అంబయ్యను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అంబయ్య శనివారం వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడి కార్యాలయానికి వెళ్లి విచారణ చేపట్టారు.
    అసలేం జరుగుతోందంటే...
    నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మన జిల్లాలో 2010, సెప్టెంబర్‌ 8 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీలకు గాను, ఒక్కో గ్రామ పంచాయతీకి ఇద్దరు చొప్పున వీసీవోలను నియమించారు. మండలస్థాయిలో మండల కో ఆర్డినేటర్, జిల్లాస్థాయిలో జిల్లా రిసోర్స్‌ పర్సన్లను నియమించారు. వీసీవోలకు రూ.2వేల చొప్పున జిల్లాలోని 2414 మందికి ప్రతినెలా రూ.48.28 లక్షలు, 57 మంది మండల కో ఆర్డినేటర్లకు రూ.6,500 చొప్పున రూ.3.70 లక్షలు చెల్లిస్తున్నారు. గ్రామంలోని నిరక్షరాస్యులను గుర్తించడం, వారికి అక్షరాలు నేర్పించడమే వీరి పని. కానీ ఇటీవల ఆ కార్యక్రమం పూర్తిగా మరుగునపడింది. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి వంటి చోట్ల మినహా ఎక్కడా చురుగ్గా అమలవుతున్న దాఖలాల్లేవు. వీసీవోలు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. మరే ఉద్యోగం చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని కారోబార్లు, ఆశావర్కర్లు, సీఆర్‌పీలు ఒకవైపు గౌరవ వేతనాలు తీసుకుంటూనే వయోజన విద్యాశాఖలోని కొందరు అధికారుల చలువతో వీసీవోల అవతారమెత్తడం విశేషం. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దాదాపు 50 మంది వీసీవోల పేరిట ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలో వేసుకుంటున్నట్లు తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 150 మంది కారోబార్లు, 75 మంది ఆశావర్కర్లు, 75 మంది సీఆర్‌పీలతోపాటు మరికొందరు ఆర్‌ఎంపీలు కూడా వీసీవోలుగా సర్కారు సొమ్మును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏటా రూ.75 లక్షల చొప్పున గత ఆరేళ్లుగా సుమారు రూ.5 కోట్లు పక్కదారిపట్టినట్లు సమాచారం. అయినప్పటికీ దీనిపై అధికారులెవరూ దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. వాస్తవానికి జిల్లా లోక్‌శిక్షా సమితి చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. కలెక్టర్‌కు తెలియకుండా ఈ తతంగమంతా నడుస్తుంటం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయంపై అంబయ్య ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కావడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అయితే 2012 నుంచి 2016 వరకు వీసీవోల వేతనాలపై వివరాలు ఇవ్వాలని అంబయ్య వయోజన విద్యాశాఖ అధికారులను కోరినట్లు తెలిసింది. కానీ 2010 నుంచి వివరాలు సేకరిస్తే పెద్ద ఎత్తున కుంభకోణం బయటపడే అవకాశాలున్నాయని వీసీవోలు అభిప్రాయపడుతున్నారు. 
    వేతనాలు సరే... పెన్నులు, పుస్తకాల సంగతేంది?
    వేతనాల స్వాహాపై విచారణ జరుపుతున్న అధికారులు వయోజన విద్యాశాఖలో జరుగుతున్న పెన్నుల కొనుగోళ్లు, పుస్తకాల ప్రింటింగ్‌ అక్రమాలపై దృష్టి సారించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏటా వీటì  పేరిట రూ.25 లక్షల సొమ్ము దుర్వినియోగమవుతోందని ఆరోపణలున్నాయి. వీటిపైనా విచారణ జరిపితే ఉన్నతస్థాయి అధికారుల బాగోతం బయటపడుతుందని ఆ శాఖలోని సిబ్బందే చెబుతున్నారు.
    నేర్పని అక్షరానికి నేడే పరీక్ష.. 
    మరోవైపు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నేడు నిరక్షరాస్యులకు అక్షరాస్యత పరీక్ష జరగనుంది. సాక్షరతా భారత్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌(ఎన్‌ఐఓఎస్‌) సంయుక్తంగా నిర్వహించే ఈ పరీక్షకు సుమారు లక్ష మంది హాజరవుతున్నారని అంచనా వేసిన వయోజన విద్యాశాఖ వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు ఇంతవరకు ఏ ఒక్క నిరక్షరాస్యుడు పేరు నమోదు చేసుకోలేదు. వారికి అక్షరాలు నేర్పిన పాపాన పోలేదు. కానీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) అధికారులు మాత్రం ఈ పరీక్షకు 92 వేల మందిని తీసుకొస్తామని, వారి పేర్లు నమోదు చేశామని, వారికి అక్షరాలు కూడా నేర్పామని చెబుతుండటం విశేషం. వాస్తవానికి గతంలో పరీక్ష రాసిన వారిని, గ్రామాల్లోని అక్షరాస్యులను తీసుకొచ్చే బాధ్యతను వీసీవోలు, ఎంసీవోలు, డీఆర్‌డీఏ క్షేత్రస్థాయి సిబ్బందిపై మోపినట్లు తెలిసింది. మొత్తమ్మీద ఆదివారం జరగబోయే పరీక్షలు ప్రహాసనమే కాబోతున్నాయి. ఈ విషయంపై పత్రికల్లో వార్తలొచ్చినప్పటికీ... ఏ ఒక్కరికీ ఇంతవరకు అక్షరాలు దిద్దించలేదని తెలిసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవవడం విశేషం. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement