ఉపాధికోర్సుల్లో ఉచిత శిక్షణ
Published Fri, Sep 16 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
తాడేపల్లిగూడెం : నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18–35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు బ్యూటీషియన్, మెహందీ, మగ్గం, గ్లిట్టరింగ్ వర్క్స్ నేర్పిస్తామన్నారు. బ్యూటీషియన్, మెహందీ కోర్సు నేర్చుకునే వారు పదో తరగతి చదివి ఉండాలని, వీరికి వచ్చేనెల 3వ తేదీ నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. మగ్గం, గ్లిట్టరింగ్ వర్క్స్ నేర్చుకునేవారు ఐదో తరగతి చదివి ఉండాలని, వచ్చేనెల 3వ తేదీ నుంచి 21 రోజులపాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 18–35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతకు బేసిక్ ఫొటోగ్రఫీ, మొబైల్ ఫోన్స్ రిపేరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. ఫొటోగ్రఫీలో 21 రోజులు, మొబైల్ ఫోన్ రిపేరింగ్‌పై నెల రోజులు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కోర్సులు నేర్చుకునే వారు పదో తరగతి చదివి ఉండాలన్నారు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు శిక్షణ కేంద్రానికి వెళ్లేందుకు అయ్యే చార్జీలు కూడా చెల్లిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్క్స్ లిస్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, బమ్మెర పోతన వీధి, అశోక్ నగర్, ఏలూరు చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08812–253975, 98660 94383, 94909 98882 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Advertisement