జంబ్లింగ్‌లో గ్యాంబ్లింగ్
జంబ్లింగ్‌లో గ్యాంబ్లింగ్
Published Mon, Jan 30 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
- జంబ్లింగ్‌లో ‘కార్పొరేట్’ మాయ
- సెంటర్లను మార్చుకున్న
కార్పొరేట్ కాలేజీలు?
- ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం
- వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి.
కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి.
వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...!
కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు.
విద్యార్థులే సమిధలు..
వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట.
కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్‌ఐవో
జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు.
Advertisement