కొవ్వాడపై వడివడిగా అడుగులు!
Published Wed, Jul 27 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
– ఒకవైపు నిరసనలు... మరోవైపు భూప్రకంపనలు
– అయినా వెనక్కి తగ్గని సర్కారు
– భూసేకరణపై అధికారులతో సమీక్ష సమావేశం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకవైపు ప్రజలు, ప్రజాసంఘాల నిరసనలు.. మరోవైపు తరచూ భూమి కంపిస్తున్నా ప్రభుత్వం మాత్రం కొవ్వాడ న్యూక్లియర్ పార్కుపై వెనకడుగు వేయట్లేదు. ఎలాగైనా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో రహస్య సమావేశం జరిగింది. కలెక్టరు పి.లక్ష్మీనృసింహం, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి బి.కృష్ణభారతి, ఆర్డీవో బలివాడ దయానిధి, కొవ్వాడ భూసేకరణ అధికారి జె.సీతారామారావులతో పాటు కొవ్వాడ న్యూక్లియర్ పార్కు చీఫ్ ఇంజినీర్ వెంకటరమేష్‌లను కలెక్టరు చాంబరుకు పిలిచి మంతనాలు సాగించారు భూసేకరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నిర్వాసితులకు ప్యాకేజీపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం, నిర్వాసితుల్లో ఒక వర్గం పూర్తిగా న్యూక్లియర్ పార్కును వ్యతిరేకించడం, ఇటీవలే సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ పర్యటన నేపథ్యంలో ఏర్పడిన సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయమై చర్చించినట్లు తెలిసింది.
రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ పరిధిలో దాదాపు 2,100 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన న్యూక్లియర్ పార్కును తొలుత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావు వ్యతిరేకించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడంపై గుజరాత్‌లో వ్యతిరేకిస్తే అక్కడ విరమించుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొవ్వాడలో న్యూక్లియర్ పార్కు ఏర్పాటు వల్ల భవిష్యత్తులో తలెత్తే విపత్తులపై విపక్షాలు, ప్రజాసంఘాలు శ్రీకాకుళం జిల్లా సహా ఉత్తరాంధ్రలో వరుసగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇదికూడా సర్వాత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు జిల్లాలో తరచుగా భూప్రకంపనలు రావడం కూడా కొవ్వాడలో అణువిద్యుత్తు కర్మాగారం ఏర్పాటు చేస్తే భద్రత ఎలా ఉంటుందోననే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొవ్వాడలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
Advertisement
Advertisement