అంత్యం ఆర్భాటం
అంత్యం ఆర్భాటం
Published Thu, Jul 28 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
29కి ఏర్పాట్లు పూర్తి
30న ట్రయల్ రన్
ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు
దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు
ముగింపు రోజున సీఎం రాక
సాక్షి, రాజమహేంద్రవరం :
గోదావరి అంత్యపుష్కరాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 29 నాటికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోంది. 30వ తేదీ ఉదయం 7 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని శాఖల అధికారులు, ఎన్‌జీవో సంస్థలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు జరుగుతున్న తీరు, ఇంకా చేయాల్సిన పనులపై చర్చించారు. అంతకు ముందు కలెక్టర్ అధికారలతో కలిసి ఘాట్ల వద్ద జరుతున్న పనులను పరిశీలించారు.
ఇతర ప్రాంతాల భక్తులు కోటిలింగాల ఘాట్‌కు..
బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కోటిలింగాల ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఎంత మంది భక్తులు వస్తారో తెలుసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. 800 మంది ఎన్‌జీవోల సేవలను ఉపయోగించుకోన్నారు. నిషేధిత ఘాట్లలోకి కూడా భక్తులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
సీసీ కెమేరాలతో..
నగరంలోని అన్ని ఘాట్లలో నగరపాలక సంస్థ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తోంది. రూ.2 లక్షలతో 40 సీసీ కెమెరాలు కొనుగోలు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ, పోలీసు అతిథి గృహంలో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఘాట్లలోనికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం జల్లు స్నానం ఏర్పాటు చేస్తున్నారు.
దేవాలయాల్లో..
ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాలనుప్రతి రోజూ పూలు, పచ్చటి తోరణాలతో అలంకరించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనుంది. ఉచిత ప్రసాదాలు అందించనుంది. 12 రోజుల పాటు నిత్య హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పిండ ప్రదానాల సామాగ్రి కోసం అధికారులు ఘాట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
వేదఘోష నడుమ ముగింపు వేడుకలు...
అంత్యపుష్కరాలకు ఘనంగా ముగింపు
పలికేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఉన్న వేదపండితులందరినీ పుష్కరఘాట్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ముల్తైదువలు అరటి దొప్పలతో
దీపాలను వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Advertisement
Advertisement