గోపాలబాబా పార్ధివ దేహానికి అంత్యక్రియలు
పిఠాపురం టౌన్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అవధూతగా భక్తులు కొలిచే గోపాలబాబా పార్ధివ దేహానికి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం అంతిమ సంస్కారం నిర్వహించారు. బాబా దేహాన్ని ఆయన పడక గదిలోనే శాస్త్రోకంగా సమాధి చేశారు. బాబా పవిత్ర దేహానికి పంచ గవ్యాలు, పుష్కర జలాలు, పంచ లోహాలు, నవరత్నాలతో అభిషేకించి తులసి, మారేడు, గన్నేరు పత్ర, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిమాలయ యోగులు, సద్గురువులు పాల్గొన్నారు.బాబా సమాధి కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకూ సాగింది. సమాధిలో కర్పూరం, ఉప్పు, పచ్చ కర్పూరం, విభూది వేశారు. పిఠాపురం బైపాస్ రోడ్డులో గోపాలబాబా ఆశ్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు, వీక్షించేందుకు బయట వ్యక్తులను, పాత్రికేయలను నిర్వాహకులు అనుమతించలేదు. ఆశ్రమ ప్రాంగణంలోని ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి బాబా అంత్యక్రియలను ప్రదర్శించారు. భక్తులు గోపాలబాబా అంత్యక్రియలను తెరలపై వీక్షించి దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయారు. గోపాలబాబాను సమాది చేసిన చోటును ఆలయంగా తీర్చిదిద్ది భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇకపై కూడా ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని వారు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే బాబా పార్ధివ దేహాన్ని దర్శించుకున్నారు.