గోరంత రాజు... కొండంత కోపం | gorantha raju angry | Sakshi
Sakshi News home page

గోరంత రాజు... కొండంత కోపం

Published Sat, Apr 8 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

రాజరాజనరేంద్రుడు, కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు, ఇతర నరపతులు ఏలిన రాజ్యమది. వేదంలా ఘోషించే గోదావరి గీతంలో ఈ విషయాన్ని ఆరుద్ర కూడా ప్రస్తావించారు. వాస్తవానికి తూర్పు చాళుక్యులు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం

  • చరిత్ర అడక్కు...చెప్పిందే వినాలి
  • ఇదీ చంద్రవంశ పాలనా తీరు
  • (లక్కింశెట్టి శ్రీనివాసరావు)
    రాజరాజనరేంద్రుడు, కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు, ఇతర నరపతులు ఏలిన రాజ్యమది. వేదంలా ఘోషించే గోదావరి గీతంలో ఈ విషయాన్ని ఆరుద్ర కూడా ప్రస్తావించారు. వాస్తవానికి తూర్పు చాళుక్యులు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు సమీపాన వేంగిపురం (ప్రస్తుతం పెదవేగి)రాజధానిగా చేసుకుని పాలించేవారు. అంతర్గత కలహాల కారణంగా వాళ్ల వంశీకుడైన అమ్మరాజు విష్ణువర్థనుడు 921–927 మధ్య రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి పాలన సాగించాడు. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజుల కాలం ముగిశాక డచ్, ఫ్రెంచి, ఆంగ్లేయులు పాలిస్తూ వచ్చారు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరంలో రెండు దశాబ్దాలపాటు గోరంత రాజు అనే సామంతుడి పాలన సాగింది. గుంటూ రు ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించిన ‘గోరం’త సామంత రాజుకు కాస్త గోరోజనం ఎక్కువే. హస్తిన రాజకీయాల్లో కుదిరిన ఒడంబడిక ప్రకారం ఆ సామంత రాజు చారిత్రక రాజ్యాన్ని విడిచిపెట్టి పొరుగు రాజ్యానికి వలసపోయి మూడేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు.
     
    బొడ్డుకూడా ఊడని పుత్రరత్నానికి సరిపోనా...!
    మంగళగిరి రాజధానిగా పాలన సాగిస్తున్న ‘చంద్ర’వంశ చక్రవర్తికి మూడేళ్లుగా గోరంత రాజు (సామంతరాజు) అడుగులకు మడుగులొత్తిన వాడే. అటువంటి సామంతరాజుకు చంద్రవంశ చక్రవర్తిపై యుద్ధం ప్రకటించేటంతటి ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అదేదో తన రాజ్యంలో ప్రజల కోసం అనుకునేరు. అలా అనుకుంటే తçప్పులో కాలేసేస్తారు. కాస్త నిదానంగా ఆలోచిస్తే సామంత రాజు వైఖరిలో మార్పునకు కారణం ఇట్టే పసిగట్టేయొచ్చు. చంద్రవంశ చక్రవర్తి తన పుత్రరత్నాన్ని తన కొలువులో కూర్చోబెట్టాలని ఎంతో కాలంగా ఆరాటపడుతున్నాడు. తన తరువాత సింహాసనాన్ని అధిష్టించేది తన పుత్రరత్నమేనని చంద్రవశం చక్రవర్తి కలలుగంటున్నారు. రాజకీయాల్లో బొడ్డు కూడా ఊడని, రాజ్యపాలన అంటే ఏమిటో బొత్తిగా తెలియని ముద్దపప్పు లాంటి తనయుడికి కొలువులో చోటు ఇచ్చి తెలుగు రాజకీయాల్లో సిద్ధాంతకర్తయిన కాకలుదీరిన తననే పక్కనబెడతాడా అంటూ గోరంత రాజుకు ఎక్కడలేని కోపమొచ్చేసింది.
     
    చంద్రవంశ రాజుపై గుర్రు...
    చంద్రవంశ రాజు కొలువులో అతని పక్కన ఆశీనులవ్వాల్సిన మొదటి మంత్రిని తానేనని ఆ ‘గోరంత’రాజు భావన. ఇవేమీ చంద్రవంశ రాజుకు తెలియవా ఏమిటి. అందుకే ఆయన గోరంతరాజును కొలువుల సోదిలో కూడా లేకుండా చేసేశారు. కానీ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాన్ని సుసంపన్నం చేసిన పేదలు, రైతుల పెన్నిధి, మహానేత రాజశేఖరుడి ఆశయాల వెంట నడిచేందుకు వచ్చి వ్యక్తిగత స్వార్థం, డబ్బు మూటలు, అధికార కాంక్ష కోసం చంద్రవంశ రాజ్యానికి ఫిరాయించిన 21 మందిలో నలుగురిని తన కొలువులోకి తీసుకున్నాడు. అందుకేనేమో గోరంత రాజుకు చంద్రవంశ రాజుపై ఎక్కడ లేని కోపం వచ్చేసింది. చంద్రవంశ రాజు, ఫిరాయింపుదారులతో ఏర్పడ్డ కొలువులపైనా సామంతరాజు గుంటూరు మిర్చిలా రెచ్చిపోయి నోటికొచి్చనట్టు తిట్టిపోశారు. చంద్రవంశ రాజునైతే వ్యక్తిగతంగా చీవాట్లు పెట్టడానికీ వెనుకాడ లేదు. అంతటి ధైర్యం, తెగువ మా సామంత రాజుకు ఎక్కడి నుంచి వచ్చాయా అని రాజ్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని  వేగులు  చంద్రవంశ రాజు చెవిలో వేశారు. తన కొలువులో తీసుకోవడానికి గోరంతరాజుకు అసలు అర్హతే లేదని చంద్రవంశ రాజు కొట్టిపారేశారు.
     
    రాజకీయ వ్యాపారం ఇప్పుడు గుర్తుకొచ్చిందా...
    కొలువు దక్కకపోయేసరికి ఫిరాయింపులన్నీ నీతి బాహ్యమైపోయాయి. రాజకీయాలన్నీ వ్యాపారమయమైపోయాయంటూ ఎక్కడ లేని నీతిసూత్రాలు వల్లెవేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నానని, ఇంతవరకు ఏమీ సంపాదించుకోలేదని ప్రకటించుకున్న ఆ సా మంత రాజు నిజ రూపం తెలిసిన ఆ రాజ్యం లో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడాది క్రితమే ఈ అనైతిక ఫిరాయింపులు నిండు సభలో కళ్లెదుటే జరిగినా స్పందించని ఈ రాజుకు ఇప్పుడు హఠాత్తుగా నీతివంతమైన రాజకీయాలు గుర్తుకు వచ్చాయా అని రాజ్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. హైదరాబాద్‌ రాజధానిగా ఏలుతున్న కల్వ గుంట్ల రాజ్యంలోకి ఫిరాయించిన వారిని కొలువులోకి తీసుకున్నప్పుడు ఈ రాజుకు రాజకీయాల్లో నీచం కనిపించలేదా అని అనుచరులే మనసులో ప్రశ్నించుకుంటున్నారు. 
    ఏడాదికాలంగా చంద్రవంశంలో ఫిరాయింపులు జరుగుతున్నా ఎందుకు మౌనం వహించినట్టోనని ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. నోరుపారేసుకున్న విషయం వేగుల ద్వారా తెలుసుకున్న చంద్రవంశ రాజు గోరంతరాజుపై కత్తులు నూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పారేసుకున్న నోటిమాట వెనక్కు తీసుకుని సర్ధుకుపోయే ప్రయత్నం చేస్తారా? లేక రాజ్యాన్నే వదులుకుంటారో తేలాలంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement