వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరు
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరు
Published Sun, Feb 26 2017 10:26 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– నేడు ఉదయం నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తన అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని రంగంలోకి దింపింది. మరో వైపు అధికార పార్టీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదు. మరో సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని శిల్పా పట్టుపబడుతున్నారు. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార పార్టీలోని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే అధికార పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన మెజార్టీ వాస్తవానికి లేదు. అయినప్పటికీ అభ్యర్థులు బరిలో నిలపడం ద్వారా ఓటుకు నోటు వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
జిల్లాలో 53 జెడ్పీసీటీ స్థానాలు ఉన్నాయి. ఇక ఎంపీటీసీల సంఖ్య 815 కాగా, ఇందులో 11 మంది లేరు. దీంతో ఎంపీటీసీల సంఖ్య 804గా ఉంది. మరో వైపు వివిధ మున్సిపాలిటీలను కౌన్సిలర్లలో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉంది. ఈ లెక్కన ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తరహాలో ఇక్కడ కూడా అభ్యర్థిని కొనుగోలు చేసి గెలవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పార్టీ తరఫున భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడవద్దని ఆ పార్టీ భావిస్తోంది.
ఉదయం 10 గంటలకు నామినేషన్ ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి 10.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా జిల్లాలో పార్టీ సత్తా మరోసారి చాటాలని ఆ పార్టీ ఒక ప్రకటనలో కోరింది.
Advertisement