
విష్ణు అరెస్ట్‌లో ప్రభుత్వ కుట్ర: రఘువీరా
సరిగా స్పందించలేదని నేతల్ని నిర్బంధించిన విష్ణు వర్గీయులు
సాక్షి, విజయవాడ బ్యూరో: స్వర్ణ బార్‌లో విష ప్రయోగంతో జనం చనిపోయిన బాధాకరమైన ఘటనను కూడా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించుకోవడం దారుణమని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కల్తీ మద్యం కేసులో ఇరికించడంలో ప్రభుత్వ కుట్ర ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్యతో కలసి శనివారం విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బార్‌లో సేకరించిన మద్యం, నీళ్ల నమూనాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేయడంలో చంద్రబాబు తీరు దారుణంగా ఉందని, రానున్న కాలంలో ఇంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సి.రామచంద్రయ్య హెచ్చరించారు.
నేతల్ని నిర్బంధించిన విష్ణు వర్గీయులు
విష్ణును అక్రమంగా కేసులో ఇరికించినా పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ నాయకులపై విష్ణు వర్గీయులు ఫైర్ అయ్యారు. తొలుత కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు రఘువీరా, కేవీపీ, రామచంద్రయ్యల ముందు విష్ణుకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడంతో వివాదానికి దారితీసింది. దీంతో ఆగ్రహించిన విష్ణు వర్గీయులు కొద్దిసేపు కాంగ్రెస్ నేతల్ని కార్యాలయంలో ఉంచి నిర్బంధించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గన్‌మెన్లు వచ్చి తలుపు తెరిచి నాయకుల్ని బయటకు తీసుకొచ్చారు. అనంతరం సబ్‌జైలుకు వెళ్లి విష్ణును పరామర్శించి, ఆ తర్వాత ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతలు ధైర్యం చెప్పారు.