పవిత్రోత్సవాల్లో భాగంగా గోవిందరాజస్వామి వారికి అభిషేకం చేస్తున్న దృశ్యం
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసివైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, నారికేళ జలం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు. రూ.500లు చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. కార్యక్రమంలో పెద్దజీయంగార్ స్వామి, చిన్నజీయంగార్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.