రాళ్ల సొమ్ము.. ‘రాజుల’ పాలు
♦ రూ.లక్షల విలువ చేసే గ్రానైట్ రాళ్లు పక్కదారి
♦ అక్రమంగా ఓ కంపెనీ ఆవరణలో నిల్వ
♦ అక్కడి నుంచి దారిమళ్లించిన పెద్దమనుషులు
♦ వత్తాసు పలికిన అధికారులు!ప్రజాధనం దుర్వినియోగం
మెదక్: రాజుల సొమ్ము రాళ్ల పాలు.. సామెతను తిరగ రాస్తే రాళ్ల సొమ్ము రాజుల పాలు అవుతుంది. సరిగ్గా ఇదే జరి గింది ఇక్కడ. ప్రజల సొత్తు పరుల పాలైంది. లక్షలాది రూపాయల విలువ చేసే గనేట్ రాళ్లు పక్కదారి పట్టాయి. వీటిని ఓ కంపెనీలో అక్రమంగా నిల్వ చేశారు. అక్కడి నుంచి గట్టుగా మరోచోటుకు తరలించారు. ఓ కాంట్రాక్టర్ నిర్వాకానికి అధికారులు వత్తాసు పలికారు. ఈ తతంగం వెనుక పలువురు ప్రజాప్రతినిధులు హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ పట్టణంలో నర్సాపూర్ వెల్‌కంబోర్డు నుంచి పట్టణ శివారులోని బోధన్ ప్రధానరోడ్డు వరకు ఇరువైపులా రూ.3.50 కోట్లతో గత 2001లో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో మురికి కాల్వలు నిర్మించారు.
ఈ యేడు మెదక్ పట్టణంలోని రోడ్ల వెడల్పుతోపాటు ఇరువైపులా ఉన్న మురికి కాల్వలను సీసీతో నిర్మించేందుకు రూ.15.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 1.6 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణంతోపాటు సుమారు మూడు కిలో మీటర్ల మేర మురికి కాల్వలను సీసీతో నిర్మించాల్సి ఉంది. కాగా ఈ పనులను ఓ ప్రజాప్రతినిధి బంధువు చేజిక్కించుకున్నట్టు తెలిసింది. దీంతో 15 ఏళ్ల క్రితం గనేట్ రాళ్లతో నిర్మించిన మురికి కాల్వలను జేసీబీలతో తవ్వారు. అందులో వచ్చిన గనేట్‌ను మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులోని డాంబర్ కంపెనీ, కంకర మిషిన్ ఆవరణలో గుట్టలు గుట్టలుగా పేర్చారు. అంతేకాకుండా డాంబర్ కంపెనీలో వీటిని అడుగు రాళ్లుగా వాడుతున్నట్టు తెలిసింది. ఈ రాళ్లనే పాపన్నపేటలో నిర్మిస్తోన్న ఓ ప్రభుత్వ భవనానికి వాడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ బండరాళ్లను 2001లో సుమారు కోటి రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలిసింది.
ఈ రాళ్లను ప్రస్తుతం వేలం వేసినా ప్రభుత్వానికి సుమా రు రూ.50 లక్షల ఆదాయం వచ్చేదని పలువురు అభిప్రాయపడుతున్నా రు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో చిన్నసైజు రాయి రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఈ మురికి కాల్వల సైజు రాయి పెద్దగా ఉండటంతో రూ.20 వరకు విక్రయిస్తుంటారు. లక్షలాది రాళ్లను డాంబర్, కం కర మిషిన్ యజమానికి ఎందుకు అప్పగించారో అధికారులకే తెలి యాలి. సదరు కాంట్రాక్టర్‌కు, అధికారులకు మధ్య ఉన్న సంబంధంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ కంపెనీ యజమానికి పలువురు ప్రజాప్రతినిధులు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలుస్తోంది. అతని వెనుక ఉన్నది కూడా సదరు ప్రజాప్రతినిధులేనన్న ఆరోపణలున్నాయి. ప్రజల సొత్తును రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులు స్పందించి డాంబర్ కంపెనీలో నిల్వ ఉంచిన రాయిని ఏం చేశారో? తేల్చాలని అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.
ఔను, అక్కడే నిల్వ చేశాం...
మెదక్ పట్టణంలోని మురికి కాల్వల నుంచి తీసిన రాయిని మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులోని డాంబర్ కంపెనీ ఆవరణలో నిల్వచేసిన మాట వాస్తవమే. పాతరాయి కావడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఈ రాయిని పాపన్నపేట మండలంలోని ఓ భవన నిర్మాణానికి వినియోగించిన విషయం నాకు తెలియదు. - రియాజ్, ఆర్‌అంబ్‌బీ జేఈ