
కొండముచ్చుల మధ్య గ్రూపు విబేధాలు
జ్ఞానం ఉండే మనుషుల మధ్యే కుట్రలు.. కుతంత్రాలు.. గ్రూపులు రాజుకుంటుంటాయి.
తిరుమల : జ్ఞానం ఉండే మనుషుల మధ్యే కుట్ర లు.. కుతంత్రాలు.. గ్రూపులు రాజుకుంటుంటాయి. ఇక ఆటవిక జీవనం సాగించే జంతువుల్లో అలాంటి లక్షణాల మోతాదు మరింత ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు తిరుమలలోని కొండముచ్చులే నిదర్శనం. వాటి గ్రూపుల మధ్య వచ్చిన విభేదాలతో దారినపోయే భక్తులపై తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఫలితంగా అటవీశాఖ సిబ్బంది కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి.
ఎనిమిది ఘటనలు.. తొమ్మిది మందికి గాయాలు
తిరుమలలో పది రోజులుగా కొండముచ్చులు (గండ్రంగులు) హల్‌చల్ చేస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో ఎనిమిదిసార్లు దాడికి తెగబడ్డాయి. బుధవారం కూడా మరో ఇద్దరిపై డాడిచేసి గాయపరిచాయి. ఈ ఘటనల్లో మొత్తం తొమ్మిది మంది భక్తులు గాయాలపాలయ్యారు.
కొండముచ్చుల వేట కోసం ఎనిమిది బృందాలు
భక్తులపై దాడికి తెగబడిన కొండముచ్చులను పట్టుకునేందుకు డీఎఫ్‌వో ఎన్‌వీ శివరామ్‌ప్రసాద్, రేంజర్లు కృష్ణయ్య, రామ్లానాయక్ నేతృత్వంలో ఎనిమిది బృందాలను నియమించారు. భక్తులపై దాడికి దిగిన వాటిని గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బందితోపాటు తిరుపతి జూపార్క్ నుంచి వైద్యులు తోహిబా, అరుణ్ చాకచక్యంగా వ్యవహరించారు. ట్య్రాంక్విలైజర్ గన్‌తో పలుమార్లు షూట్‌చేసి మత్తుమందిచ్చారు.
చెట్టుమీద నుంచి పడిపోతే ప్రాణాలతో కాపాడేలా ప్రత్యేకంగా వలవేసిపట్టుకుని బోనులో బంధించారు. వెంటనే విరుగుడు మందిచ్చారు. ఐదు నిమిషాల్లో ఆ రెండు కొండముచ్చులు తేరుకున్నాయి. వాటిని తిరుపతి జూపార్క్‌కు తరలించారు.
గ్రూపులే దాడులకు కారణం
కొండముచ్చుల మధ్య గ్రూపుల వల్లే దాడులకు ప్రధాన కారణం. లైంగిక సమయాల్లో వాటి మధ్య విభేదాలు వస్తుంటాయి. ఇతర జంతువులు వాటిపై దాడులుచేసిన సందర్భాల్లో అవి ప్రతీకారం కోసం వేచి ఉంటాయి. ఇలా గాయపడ్డ ముచ్చులు కనిపించిన జంతువులు, జనంపై దాడులు చేస్తాయి. సాధారణంగా అవి జనాన్ని కరవవు. జరిగిన దాడుల్లో వాటి గోళ్లతో రక్కినవే. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
- ఎన్‌వీ శివరామ్‌ప్రసాద్, టీటీడీ డీఎఫ్‌వో