పెరుగుతున్న ‘సింగూర్’ మట్టం
- ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు
- ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్
పుల్‌కల్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగూర్ ప్రాజెక్టులోకి భారగా వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా 29 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున 12.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం 9.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఽఫ్లో 19 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని ఈఈ రాములు తెలిపారు.
ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటన
భారీగా వరద నీరు చేరుతున్న సింగూర్ ప్రాజెక్టును కలెక్టర్ రోనాల్డ్‌రోస్ శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 9.5 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్‌కు ఇరిగేషన్ ఎస్‌ఈ పద్మారావు తెలిపారు. అక్కడి నుంచి కొండపూర్ మండలం మల్కపూర్ చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువులో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షంతో 10 అడుగుల నీరు వచ్చి చేరిందని కలెక్టర్ అధికారులు వివరించారు.