గురుభక్తి.. భక్తకోటికి ముక్తి
గురుభక్తి.. భక్తకోటికి ముక్తి
Published Mon, Feb 27 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
- నేటి నుంచి శ్రీమఠంలో రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు
- 6 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
- పీఠాధిపతి నేతృత్వంలో ఏర్పాట్లు
మంత్రాలయం : సద్గురు శ్రీరాఘవేంద్రుల జన్మదినం, పట్టాభిషేకాన్ని పురష్కరించుకుని నిర్వహిస్తున్న గురువైభవోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మార్చి 5వతేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం 396వ పట్టాభిషేక మహోత్సవం చేపడతారు. ఉత్సవంలో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకిస్తారు. 1-4 తేదీల వరకు దినసరి రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 5వ తేదీన రాఘవేంద్రుల 422వ జయంత్యుత్సవం నిర్వహిస్తారు.
రాఘవేంద్రుల చరిత్ర
మూలరూపం : శంఖు కర్ణ
గోత్రం : గౌతమి
తండ్రి : తిమ్మన భట్
తల్లి : గోపికాంబ
జననం : క్రీ.శ.1595 మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం
జన్మ నక్షత్రం : మృగశిర
జన్మభూమి : భువనగిరి, కర్ణాటక
పూర్వ నామం : వెంకటనాథుడు
వివాహం : క్రీ.శ.1614, ఆనందనామ సంవత్సరం, పాల్గుణ శుద్ధ
భార్య : సరస్వతీబాయి
ఆశ్రమంలో పేరు : శ్రీరాఘవేంద్ర తీర్థులు
రచన గ్రంథాలు : శ్రీమన్యాయసుధ పరిమళ, 48 గ్రంథాలు
బిరుదులు : వెంకటనాథాచార్య, పరిమళాచార్య, మహాభాష్య
బృందావన ప్రవేశం : క్రీ.శ. 1671 వీరూధినామ సంవత్సరం, శ్రావణ బహుళ విదియ, శుక్రవారం
అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ..
గురు వైభవోత్సవాలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రుల అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈఏడాది ఎల్బర్గాకు చెందిన పండితుడు వెంకోబ ఆచార్, రాయచూరు నవోదయ మెడికల్ కాలేజీ చైర్మన్ ఎస్.ఆర్.రెడ్డి, బెంగళూరు ఎంఆర్‌జీ గ్రూప్స్ చైర్మన్ ప్రకాష్‌శెట్టి, బెంగళూరు కిద్వాయి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ లింగేగోడ్వార్, హైదరాబాద్ విజయకుమార్, కన్నడ టీవీ9 డైరెక్టర్ మహేంద్రమిశ్రా, బీటీవీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎం కుమార్, టౌన్ ప్లానింగ్ రిటైర్డు డైరెక్టర్ రాజన్ అరవింద్, బెంగళూరు అనసూయమ్మకు బహుమతులు అందజేస్తారు.
అనుగ్రహ ప్రాప్తి : సుబుధేంద్రతీర్థులు, పీఠాధిపతి
శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాం. తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో స్నానాలకు ప్రత్యేక షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశాం. మఠం ప్రాకారాలను పుష్పశోభిత, విద్యుద్దీపాలంకరణలు గావిస్తాం. రోజూ సాయంత్రం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.
Advertisement