
'పుష్కర మరణాలు చంద్రబాబు హత్యలే'
హైదరాబాద్ : రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో తొక్కిసలాట ... 25 మంది భక్తులు దుర్మరణం చెందడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుర్నాధరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో గుర్నాధరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పుష్కర మరణాలు చంద్రబాబు హత్యలే అని ఆరోపించారు.
2004లో కృష్ణా పుష్కరాల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఐదుగురు మరణించారు.... ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను చంద్రబాబు డిమాండ్ చేసిన సంఘటనను గుర్నాధరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు 25 మంది మరణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే పదవి నుంచి వైదొలగాలని గుర్నాధరెడ్డి డిమాండ్ చేశారు.
గోదావరి పుష్కరాల్లో భద్రతా వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు చూడవలసిన అధికారులు, పోలీసులు చంద్రబాబు సేవలో తరించారన్నారు. ఈ విషాదంపై చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.