Published
Mon, Aug 1 2016 8:06 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
‘ హరితహారం ’ దేశానికే ఆదర్శం
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం బాలరాజు గురువు అయిన నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజరత్నం పదవీ విరమణ సందర్భంగా ఆయన నివాసానికి చేరుకొని వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటే రోజు 155 కిలోమీటర్ల మేర లక్షా 50 వేల మందితో ఒకేసారి మొక్కలు నాటించడం అద్భుతమన్నారు. బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రమే మొక్కలు నాటడంలో నిలిచిందన్నారు. హైవేకు రెండు వైపులా మొక్కలు నాటి ఉండడం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని మిషన్ భగీరథ, కాకతీయ, వసతిగృహాలకు సన్న బియ్యం పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. గురువులు నేర్పిన సామాజిక స్పృహలతోనే నేడు ఈ రోజు రాజకీయంగా ఎదగలిగామన్నారు. తల్లిదండ్రుల పాత్ర కంటే గురువు పాత్ర గొప్పదన్నారు.అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజరత్నం కుటుంబ సభ్యులు గువ్వల బాలరాజును గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్యాంసుందర్‌రెడ్డి, మధుసూదన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.