♦ ఆశల సాగుకు అప్పుల కుప్పలు!
♦ అడుగంటిన బోర్లు ఎండిన పంటలు
♦ దిక్కుతోచని రైతులు
ఈ సారి.. వచ్చే సారి.. మరో సారైనా పంట పండకపోతుందా.. అప్పు తీరకపోతుందా.. అని ఆశల సాగు చేస్తున్న అన్నదాతకు ప్రతిఏటా కష్టాల పెట్టుబడి.. నష్టాల దిగుబడే మిగులుతోంది. ఫలితంగా.. పది మందికి అన్నం పెట్టాల్సిన చేతులు.. పొట్ట చేత పట్టుకుని వలస బాట పడుతున్నాయి. దేవుడు కరుణించక.. సర్కారు సహ కరించక.. సాగు సంక్షోభంలో చిక్కుకున్న పుడమి పుత్రులు.. అప్పుల ఊబిలోంచి ఒడ్డున పడే మార్గం లేక విలవిల్లాడుతున్నారు. - కుల్కచర్ల
మూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో మండల పరిధిలోని చెరువులు, కుంటలు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. బోరుబావులు ఉన్న కొంతమంది రైతులు ఎకరం, అర ఎకరంలో పంటలు సాగు చేశారు. మండుతున్న ఎండల ప్రభావంతో ఇవి కూడా అడుగంటడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. కరువు నేపథ్యంలో మండలంలో 2,500 హెక్టార్ల మేర సాగు కావాల్సిన వరి.. ఈ సీజన్‌లో 500 హెక్టార్లకే పరిమితమైంది. బోరుబావుల కింద సాగు చేసిన 300 హెక్టార్ల పంట ఇప్పటికే నిలువునా ఎండిపోయింది. దీంతో బతుకుదెరువు కష్టమైన కర్షకులు ముంబై, పూణెకు వలస వె ళ్తున్నారు. పోయిన ఏడాది నష్టపోయిన పంటలకు సంబంధించిన పరిహారమే రాలేదని.. ఈ సారి వస్తుందనే ఆశ కూడా చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట ఎండింది
బోర్లు వేసేందుకు, పంట సాగుకు అప్పులు తెచ్చి రెండు నెలల్లో లక్షా ఎనభై వేల రూపాయలు ఖర్చు చేశా. పంట పండితే కనీసం పెట్టుబడైనా రాకపోతుందా అని ఆశపడ్డా. కళ్ల ముందు ఎండిపోతున్న పంటను కాపాడుకోవడానికి కరువులోనూ బోరు వేశా. పుష్కలంగా నీరు వచ్చినా 15 రోజుల్లోనే ఎండిపోవడంతో కథ మొదటికొచ్చింది. దీంతో వరి పంటలో పశువులను మేపుతున్నా.
- హరినాథ్‌రెడ్డి, పుట్టపహాడ్
పరిహారం రాలే
వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. గతంలో సర్వే చేసి నష్ట పరిహారం అందిస్తామన్నారు.. ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే అన్నదాతల బతుకు అగమ్యగోచరంగా మారక తప్పదు. రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. రైతు సంక్షేమానికి నాయకులు, ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి - సత్యయ్యగౌడ్ మాజీ ఎంపీపీ
కుల్కచర్ల మండల పుట్టపహాడ్‌కు చెందిన రైతు హరినాథ్‌రెడ్డి తనకున్న 10 ఎకరాల పొలంలో నాలుగు బోర్లు వేశాడు. ఒక్క బోరు నుంచి పుష్కలంగా నీరు రావడంతో రూ.60 వేల పెట్టుబడి పెట్టి.. రెండెకరాల్లో వరి నాటేశాడు. దీంట్లో నీరు బాగా రావడంతో పంట పండినట్లేనని సంతోషపడ్డాడు. కానీ ఇతని ఆనందం 15 రోజుల్లోనే ఆవిరైంది.. కొత్త బోరు కూడా ఎండిపోవడంతో.. చేసేది లేక పచ్చని పైరులో పశువులను మేపుతున్నాడు.