
సీఎం పర్యటనపై ఖాకీ డేగకన్ను
ఉభయ రాష్ట్రాల్లో ముందెన్నడూ లేని విధంగా మావోయిస్ట్‌ల భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
- మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఆచూకీ కోసం ప్రజాసంఘాల నేతల ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక నిఘా
- ఆర్‌కే కుమారుడు మున్నా ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం
- సీఎం పర్యటనకు ముందు రోజు హెలికాప్టర్‌తో ఒంగోలు నగరాన్ని స్కాన్
- ప్రజా సంఘాల నేతల కదలికపై ఆరా
ఒంగోలు క్రైం : ఉభయ రాష్ట్రాల్లో ముందెన్నడూ లేని విధంగా మావోయిస్ట్‌ల భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. మంగళవారం జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన కోసం ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిఘా కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు భిన్నంగా ఈ సారి పర్యటనలో పోలీసులు విభిన్న కోణాల్లో నిఘాను పెంచారు. ఒంగోలు నగరాన్ని డోన్ కెమెరాతో స్కాన్ చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందురోజు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నగరాన్ని, నగర పరిసర ప్రాంతాలను అత్యాధునిక వీడియో కెమెరాలతో పర్యవేక్షించడం ఇదే ప్రధమం కావటం విశేషం. పోలీసు భద్రతను పెంచడం ఒక ఎత్తయితే.. డోన్ కెమెరాతో పాటు ముందురోజు హెలికాప్టర్ ద్వారా నగరాన్ని కెమెరాలతో స్నానింగ్ చేయటం మరొక ఎత్తు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఒడిశా-ఆంధ్రా బోర్డర్(ఓఏబీ)లో ఈ నెల 24న జరిగిన మావోయిస్ట్‌ల భారీ ఎన్‌కౌంటరే కారణం.
ఆర్‌కే కు జిల్లాతో ఉన్న సంబంధం నేపథ్యంలో అప్రమత్తం
ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే కనుమరుగు కావటంతో పాటు ఆయన తనయుడు ఓఏబీ సెక్షన్ కమాండెంట్ అక్కిరాజు మున్నా అశువులు బాయటం అందరికీ తెలిసిందే. ఆర్కేతో జిల్లాకు సంబంధాలు ఎక్కువగా ఉండటమే భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్కే వివాహం చేసుకుంది టంగుటూరు మండలం ఆలకూరపాడులో. ఇటీవల ఆర్కే తనయుడు మున్నా అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి. మావోయిస్ట్‌లు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిని అంతమొందిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆర్కే ఆచూకీ తెలపాలంటూ విశాఖపట్నంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఒంగోలు వస్తున్నందున పోలీసులు నిఘా ఉంచారు. ఇక సాధారణంగా ప్రజాసంఘాలు, రైతు సంఘాల, కుల సంఘాలు, కార్మిక సంఘాల నేతలపై దృష్టి సారించి వారి కదలిక లపై నిఘా ఉంచారు.