ముగిసిన ఆందోళన
–మృతదేహానికి అంత్యక్రియలు
కేతేపల్లి:
మండలంలోని కొత్తపేట గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన చిట్టిమళ్ల జానయ్య అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి లోనైన జానయ్య మృతిచెందటం, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మంగళవారం రాత్రి పొద్దు పోయేంత వరకు బందువులు, గ్రామస్తులు, మృతదేహంతో కేతేపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ట్రాన్స్‌కో అధికారులు, మృతుడి బందువులతో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడి రాజీ కుదిర్చారు. మృతుని కుటుంబానికి శాఖ పరంగా వచ్చే రూ.4లక్షల అర్థికసాయంతో పాటు, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ భీమా కింది రూ.2లక్షలు, ట్రాన్స్‌కో యూనియన్ తరుపున రు.లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఎమ్మెల్యే పరామర్శ:
విద్యుదాఘాతంతో మృతి చెందిన చిట్టిమల్ల జానయ్య మృతదేహాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం దహన సంస్కారాల నిమిత్తం రూ.5వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు బుర్రి యాదవరెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య, ఆర్.సైదులు తదితరులు ఉన్నారు.