
విధేయత వల్లే నాకు టికెట్ : రాజయ్య
హైదరాబాద్ : పార్టీ పట్ల చూపిన విధేయత వల్లే తనకు హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానిక నాయకుల అభిప్రాయాలు, స్థానికత ఆధారంగా వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికకు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, ఈ అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందన్నారు. గతంలో వరంగల్‌లో చేసిన అభివృద్ధే తన ప్రచారాస్త్రమన్నారు.
సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వరంగల్ జడ్పీ సీఈవోగా రాజయ్య చాలా ఏళ్లు పనిచేశారు. అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ వరంగల్ జిల్లా నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో మొదటి స్థానంలో వివేక్ నిలిచారు. అయితే పోటీ చేసేందుకు వివేక్ నిరాకరించడంతో రెండో స్థానంలో నిలిచిన సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరు కూడా వినిపించినా స్థానికుడు కాకపోవడంతో ఇబ్బందిగా మారుతుందనే భావనతో పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.