హోంమంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ | home minister constituency ysrcp joinings | Sakshi
Sakshi News home page

హోంమంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ

Published Sat, Mar 18 2017 12:40 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

హోంమంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ - Sakshi

హోంమంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ

- బెదిరింపులకు దిగినా ఆగని వలసలు
- ఇటీవల పెద్దాపురం పట్టణ కార్యదర్శి తాళాబత్తుల
- తాజాగా యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కొల్లుబోయిన

సాక్షిప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇలాకాలో తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతల వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేస్తున్న నేతలపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తూ కుట్రలు పన్నుతున్నా వలసలను మాత్రం నిరోధించలేక చేతులెత్తేస్తున్నారు. బలవంతంగానైనా ఆపాలని తెలుగు తమ్ముళ్లు వేసిన ఎత్తులు, కుట్రలు, కిడ్నాప్‌ యత్నాలు బెడిసికొడుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలపై విసుగెత్తిపోయిన పలువురు తెలుగు తమ్ముల్లు ఒకరొకరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.

ఇటీవల ఆ పార్టీ నమ్మినబంటు టీడీపీ పెద్దాపురం పట్టణ కార్యదర్శిగా పనిచేసిన తాళాబత్తుల సాయి పార్టీ నుంచి బయటకురాగా తాజాగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ నేత కొల్లుబోయిన అరుణా శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కోఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. బీసీల నుంచి బలమైన నేతగా ఆయన రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దాపురంలో మరింత బలపడనుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. హోం మంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలో అతని నాయకత్వాన్ని ఎదిరించి ఆ పార్టీని వీడటంతో టీడీపీలో మసలం ప్రారంభమయింది. అందునా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌ అఖిలభారత యాదవ మహాసభలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో టీడీపీకి తీరని నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కిడ్నాప్‌నకు యత్నం...
శుక్రవారం బయటకు వెళ్లిపోతున్నారనే సమాచారంతో ఏదోరకంగా శ్రీనివాస్‌ యాదవ్‌ బయటకు పోకుండా అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు చివరకు కిడ్నాప్‌ చేసేందుకు సైతం వెనుకాడ లేదు. వైఎస్సార్‌సీపీలోకి శ్రీనివాస్‌ యాదవ్‌ చేరికకు ఒక రోజు ముందు గురువారం రాత్రి అతనితో తమ్ముళ్లు మంతనాలు సాగించి పార్టీ వీడ వద్దని, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామంటూ కిడ్నాప్‌ చేసేందుకు పెద్దాపురం కుమ్మరివీధిలో నాలుగు కార్లు ఏర్పాటు చేశారు. ఇంతలో విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు తన అనుచరులు హుటాహుటిన శ్రీనివాస్‌ యాదవ్‌ను వేరే గ్రామానికి తరలించారు. పెద్దాపురం మట్టే వారి కల్యాణ మండపంలో జరిగిన పార్టీలో శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు మరో 500 మంది చేరికలు సందర్భంగా నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి.

భారీ ర్యాలీతో...
శ్రీనివాస్‌ యాదవ్‌ చేరిక సందర్భంగా శుక్రవారం రాత్రి పెద్దాపురం మట్టేవారి కల్యాణ మండపంలో కో ఆర్డినేటర్‌ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. అధికారపార్టీ నుంచి వచ్చిన ప్రలోభాలు, బెదిరింపులను సైతం లెక్క చేయకుండా పెద్దాపురంలో సుమారు రెండు గంటలపాటు సాగిన  భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీకి తరలివచ్చిన యువత, జనంతో పురు వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. సుధా కాలనీ పార్టీ క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభమైన ర్యాలీ ఎం.ఆర్‌. కాలేజీ, మున్సిపల్‌ సెంటర్, కుమ్మరవీధి, మరిడమ్మ ఆలయం, దర్గా సెంటర్, మెయిన్‌ రోడ్డు మీదుగా సాగింది. దారిపొడవునా పార్టీ శ్రేణులకు స్థానికులు ఎక్కడికక్కడ స్వాగతం పలికారు.ముందుగా ముహూర్త ప్రకారం ఉదయం 10.25 గంటలకు శ్రీనివాస్‌యాదవ్‌కు కోఆర్డినేటర్‌ నాయుడు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.

క్యాడర్‌లో ఉత్సాహం...
రాత్రి జరిగిన సమావేశంలో పార్టీ నేతల ప్రసంగాలు ఆధ్యంతం కేడర్‌లో మనోధైర్యాన్ని నింపాయి. అసలే హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై వేధిపుల కేసులకు లెక్కేలేదు. ఈ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి తరలిరావడం పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీపై నెలకొన్న వ్యతిరేకతకు అద్దం పట్టిందని నేతలు చర్చించుకోవడం కనిపించింది.దివంగత నేత తోట గోపాలకృష్ణ  మెట్ట ప్రాంతానికి చేసిన సేవలను నేతల ప్రసంగాల్లో కొనియాడిన సందర్భంలో పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. మెట్ట ప్రాంతంలో చక్రం తిప్పిన గోపాలకృష్ణ రాజకీయ వారసుడిగా నాయుడికు మద్ధతు ఇవ్వడం ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలని నేతలు ఉద్బోధించారు. తూర్పు మార్పునకు నాంది పలుకుతుందని, అది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని, కేసులకు భయపడవద్దని తామున్నామంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వంటి నేతలు ధైర్యాన్ని నింపారు. చంద్రబాబుకు, వైఎస్‌కు మధ్య ఉన్న తేడాను పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తన ప్రసంగంలో పేర్కొన్నారు.  పార్టీ ప్రచార సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలో ఉన్న ప్రతి రంగు, చుట్టూ ఉన్న సంక్షేమ పథకాల గుర్తులు సోదాహరణంగా వివరించిన తీరు ఆకట్టుకుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement