
స్వప్న పెళ్లినాటి ఫొటో
రాజేంద్రనగర్: అదనపు కట్నం తెమ్మని భర్త వేధిస్తుండటంతో ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్ కుమార్తె స్వప్న (23)ను రెడ్డికోట మండలానికి చెందిన శ్రీనివాస్(27)కు ఇచ్చి రెండున్నరేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కట్నం కింద రూ. 2 లక్షల నగదు, 20 తులాల బంగారం, గృహోపకరణాలు ఇచ్చారు. శ్రీనివాస్ భార్య స్వప్నను తీసుకొని కొన్ని నెలల క్రితం హైదర్షాకోట్ ప్రాంతంలో కాపురం పెట్టాడు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని నమ్మబలికిన శ్రీనివాస్.. జులాయిగా తిరుగుతూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాడు. అదనపు కట్నం తెమ్మని కొద్ది రోజులుగా భార్యను వేధిస్తున్నాడు. వీటిని తాళలేక స్వప్న గురువారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పుష్కర యాత్రలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి నేరుగా శుక్రవారం ఉదయం నార్సింగి ఠాణాకు చేరుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను తెలిసిన వాడని శ్రీనివాస్‌కు ఇచ్చిపెళ్లి చేస్తే.. అదనపు కట్నం కోసం వేధించి ఉసురుతీశాడని బోరుమన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు