వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష నేత రాసిన లేఖపై మంత్రులు విమర్శలు చేయడం మాని వివరణ ఇవ్వాలని అన్నారు. తామెదో ఉద్దేశ పూర్వకంగా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదనుకుంటే పొరపాటవుతుందని, ఎంతోమందిని బాధపెట్టి నిర్మిస్తున్న రాజధాని కార్యక్రమానికి తాము హాజరై వారి బాధను అవమానించలేమని, వారి కన్నీళ్లను తొక్కి అవమానించలేమని చెప్పారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన పార్థసారథి.. రాజధాని పేరిట ప్రభుత్వం నిర్వహించిన తంతును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. సాక్షాత్తు ప్రధాని సైతం భూసేకరణ బిల్లు విషయంలో అందరి ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని, రైతులకు, పేదవారికి అనుకూలంగా ఉండేలా భూసేకరణ ఉంటుందని, అలా మార్పులు చేసేవరకు భూసేకరణ ఉండబోదని చెప్పినా.. అదే భూసేకరణ బిల్లుతో చంద్రబాబునాయుడు ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం 14 వేల ఎకరాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 5వేల ఎకరాలు అవసరం ఉండగా ఎందుకు 33 వేల ఎకరాలు సేకరించారని ప్రశ్నించారు.
భూమిని సేకరించిన ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, వృత్తిపై ఆధారపడి బతుకులీడ్చేవారి భవిష్యత్తుకు ఏ మేరకు భరోసా ఇచ్చారని, వారంతా ఎటుపోతారని నిలదీశారు. మెడలు వంచి ఇళ్లలో నుంచి లాగేసి మరి పేదవారి భూములను రాజధాని పేరిట కొల్లగొట్టారని, ఇప్పుడు వారంతా కంటతడిపెడుతుంటే.. ఏ విధంగా రాజధాని శంఖుస్ధాపన కార్యక్రమానికి రావాలని చెప్పారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే, అంతకంటే ముందు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తేనే బావుంటుందనేది తమ అభిప్రాయం అన్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వం ఊహించుకుంటున్న రాజధాని కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.