ఎమ్మార్వోపై దాడి: సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్చార్సీ
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఇసుక క్వారీలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక.. అక్కడి అక్రమాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి ఆమెను ఇసుకలో ఈడ్చేసిన విషయాన్ని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. జూలై 13 లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
ఎమ్మెల్యే దాడి విషయంలో ఎలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు, ఏ చర్యలు తీసుకున్నారనే అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఘటనలో సాక్షి విలేకరి నవీన్పై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీన్ని హెచ్చార్సీ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించారు. రేపటినుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీన్ని కూడా హెచ్చార్సీ గమనించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్, కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది.