ఆయనలదే పెత్తనం
భార్యల మౌనం భర్తలదే రాజ్యం
అధికారికమైనా అంతావారే
ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల దగ్గరా అదేసూత్రం
పెచ్చుమీరిపోతున్న ‘పచ్చ’పాతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతల పెత్తనం పెచ్చుమీరిపోతోంది. ఆ పార్టీ నేతలు జిల్లాలో రా జ్యాంగేతర శక్తులుగా తయారయ్యా రు. ఇందుగలడందు లేడనే సామెత ను తలపించే రీతిలో ఆ పార్టీ నేతలు అన్నింటా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతలే తమకు ముఖ్యమని, వారు చెప్పిన పనులు చేయాల్సిందేనని హుకుం జారీచేశారు. సీఎం స్థాయి నుంచే అటువంటి ఆదేశాలు రాడంతో కలెక్టర్‌లే చేసేదేమీ లేక వారు చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల సిఫార్సులకు అగ్రతాంబూలం వేయాల్సిన అనివార్య పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, గృహనిర్మాణాలు, బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు మంజూరవ్వాలన్నా పార్టీ నేతల సిఫార్సులు తప్పడం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన అర్హత పార్టీ నేతల ఆమోదముద్రే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ వరకు అడుగడుగునా జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ప్రతి చోటా వారి పెత్తనమే కనిపించడంతో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదురైంది. ప్రజాగ్రహంతో తమకు పని లేదన్నట్టుగానే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
ఇదిగో తాజా ఘటన...
తాజాగా రెండు రోజుల కిందట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశం తీరు ఆ పార్టీ నేతల వ్యవహారశైలికి అద్దంపడుతోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాపు, బీసీ రుణాలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. కానీ మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో విశ్వనాథరెడ్డి వేదికపై ఉన్నా ఎప్పటి మాదిరిగానే పెత్తనమంతా ఎమ్మెల్యే భర్త, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబుదే. సత్తిబాబుతోపాటు ఆ మండల ఎంపీపీ, జడ్పీటీసీలు పుల్లా సుధ, కాకరపల్లి సత్యవతి భర్తలు చందు, చలపతిరావులు పెత్తనం చెలాయించడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోను దాదాపు ఇదే ఒరవడిని పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలైనా, పనుల కాంట్రాక్ట్‌లైనా, అధికారులు బదిలీలైనా పెత్తనమంతా వారిదే. చివరకు శిలాఫలకాలపై వారి పేర్లు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే ధైర్యం అక్కడి అధికారులకు లేనేలేదు. ఈæ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా నామ్‌కేవాస్తే అన్నట్టుగా మార్చేశారని నియోజకవర్గ ప్రజలు ఆక్షేపిస్తున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోయే అధికార పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేతోపాటు మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన చోటా అంతే...
జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న కొత్తపేట, తుని, రంపచోడవరం నియోజకవర్గాల్లో వారిని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. కొత్తపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కాదని పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSఛార్జి బండారు సత్యానందరావుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు మైక్‌ను లాగేసుకుని దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాదని పార్టీ నేతలే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అక్కడ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెత్తనమంతా తమ్ముళ్లదే. మిగిలిన నియోజకవర్గాల్లోను దాదాపు ఇదేరకంగా పార్టీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారు.