నిబంధనలు మీరితే లైసెన్సుల రద్దు
Published Wed, Oct 5 2016 9:25 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM
గుంటూరు వెస్ట్: జిల్లాలోని బల్లకట్టు, పడవరేవుల కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక చార్జీలు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో పుట్లగూడెం, గోవిందాపురం, రామాయగూడెం బల్లకట్టు, మాదిపాడు పడవ రేవుల కాంట్రాక్టర్లు, నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి మాట్లాడుతూ నిర్ణీత రుసుం కన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ధరల వివరాలు, పడవ, బల్లకట్టు కెపాసిటీ తెలియజేసేలా బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని చెప్పారు. లైసెన్సులను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో జోసఫ్‌కుమార్, బల్లకట్టు, పడవ రేవుల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement