ఇక్కడ దొర.. అక్కడ దొంగ
► చోరీ కేసులో శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడు గోవిందరెడ్డి అరెస్టు
► గతంలోనూ పలు కేసుల్లో నిందితుడు
► టీడీపీ నేత కావడంతో కంగుతిన్న పచ్చ నేతలు విస్తుపోయిన రైతులు
పాయకరావుపేట: ఇక్కడ దొర.. అక్కడ దొంగగా చెలామణి అవుతున్న ప్రజాప్రతినిధి భాగోతం బయటపడటంతో రైతులు విస్తుపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టోర్స్‌లో రాగి ప్లేట్లు అపహరించిన కేసులో ఈనెల9న మండలంలోని శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడు రావాడ గోవిందరెడ్డిని స్టీల్‌ప్లాంట్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5.82 లక్షలు విలువచేసే ఎనిమిది కాపర్ దిమ్మలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన గోవిందరెడ్డి గాజువాకలో ఉంటూ పాత ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. అధికారపార్టీకి చెందిన ఈయన ప్రస్తుతం పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈయనపై గాజువాక పోలీసుస్టేషన్‌లో 2012,2013లో వివిధ సెక్షన్ల కింద దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలోని ఒక కేసులో నేరం రుజువుకావడంతో జైలుశిక్ష అనుభవించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ స్టోర్స్‌లో రాగా ప్లేట్లు దొంగతనం కేసులో ఆరో ముద్దాయిగా పోలీసులు అతనిని అరెస్టు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.
ఈవిషయం తెలుసుకున్న చాలామంది రైతులు ముక్కున వేలేసు కుంటున్నారు. రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతు ప్రతినిధిగా ఉన్న ఇవేమి పనులంటూ ఆయనను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇలావుండగా గోవిందరెడ్డి అరెస్టు అధికారపార్టీలో కలకలం రేపింది. ఆయన వర్గీయులు డైలమాలో పడ్డారు. ఈవిషయంపై వైఎస్సార్‌సీపీ జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు మాట్లాడుతూ పీఏసీఎస్ అధ్యక్షుడు అయి ఉండి దొంగతనం కేసుల్లో పట్టుబడటం సిగ్గు చేటన్నారు. రైతులు తలదించుకునేలా ఆయన వ్యవహరించారని ధ్వజమెత్తారు.