
చుక్కలు చూపించిన ఇండిగో విమానం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్పోర్టుకు మంగళవారం ఉదయం వచ్చిన కొందరు ప్రయాణికులు మధ్యాహ్నమైనా అక్కడే ఉన్నారు. ఎక్కాల్సిన విమానం వస్తుందని ఎదురుచూసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ నుంచి ఉదయం 7:55 గంటలకు బెంగళూరు బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నానికి కూడా విమానాశ్రయానికి రాలేదు. ప్రయాణికుల్లో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా.. ఇలా జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అక్కడివారిని కలచివేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం వల్ల విమానం రావడం ఆలస్యమైందని చెబుతున్నారు. మరేదో కారణం వల్లే ఆలస్యం జరిగిందని.. అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం అంటూ సర్థిచెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.