పరిహాసం
Published Thu, Jul 21 2016 11:19 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
– ఏడాది అవుతున్నా పూర్తికాని ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీ
– రూ.559.68 కోట్లలో రైతుల ఖాతాల్లోకి చేరింది రూ.484 కోట్లు మాత్రమే
– కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు
ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ ప్రహసనంగా మారింది. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘అనంత’ రైతులను అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదు. ఆధార్, ఆన్‌లైన్, మిస్‌మ్యాచింగ్, మరో జాబితా అంటూ తిప్పుకుంటున్నారు. పరిహారం కోసం ఏడాదిగా అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రకటించింది. మొదట్లో రూ.5,79,640 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అయితే.. కొన్ని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మందికి రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2015 జూలై 22న ఈ మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు పరిహారాన్ని విడుదల చేస్తూ వచ్చింది. అయితే.. ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయలేదు. ఇచ్చే రూ.5 వేలు.. రూ.10 వేలు.. లేదంటే రూ.15 వేల పరిహారం కోసం రైతులు ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికే వ్యయప్రయాసలకోర్చి 20–30 సార్లు మండల గ్రీవెన్స్‌లు, ఏవోలు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకర్ల చుట్టూ తిరిగారు.
జాబితాలు తప్పుల తడక
ఇన్‌పుట్‌సబ్సిడీ జాబితాల తయారీ, పరిహారం పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. జాబితాల తయారీలోనే రెవెన్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా రైతులకు సకాలంలో పరిహారం అందలేదు. కొన్నిచోట్ల అర్హులైన రైతులను అసలు జాబితాలోనే చేర్చలేదు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఎక్కువ కావడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర రాయితీలు, పథకాలను ‘తమ్ముళ్లు’ కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌పుట్‌సబ్సిడీలోనూ మాయాజాలం ప్రదర్శించినట్లు జాబితాలు చూస్తే స్పష్టమవుతోంది.
ఇంకా రూ.75 కోట్లు పంపిణీ చేయాలి: కేటాయించిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు 484 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ అయింది. ఇంకా రూ.75 కోట్లకు పైగా పంపిణీ చేయాల్సివున్నా.. ఆధార్ లింక్ పెట్టి పెద్దఎత్తున రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరకు రూ.506 కోట్లు పంపిణీ చేసి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. మిగతా రూ.53 కోట్లు ప్రభుత్వ ఖాజానాకే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీకి ఎప్పుడు ముగింపు పలుకుతారో, రైతులందరికీ ఎన్నడు న్యాయం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి.
Advertisement
Advertisement