అనంతపురం టౌన్ : వర్షాభావంతో ఎండిపోయిన పంటను రక్షకతడి ద్వారా నీరిచ్చి కాపాడామని, అయినా పంట నష్టపోతే ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం మునిసిపల్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడకు వచ్చి మంత్రులు, ఐఏఎస్‌లతో కలిసి కరువును ఎదుర్కొనే ధైర్యాన్ని రైతులకు ఇచ్చారన్నారు. రైతుల కోసం ఇంతలా కష్టపడుతుంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు.
2 లక్షలా 90 వేల 500 ఎకరాలకు తడి అందించామనీ.. దీనికి 5082 రెయిన్‌గన్స్, 4755 స్ప్రింక్లర్లు, లక్ష 28 వేల 30 పైపులు, 2404 ఆయిల్ ఇంజన్లు వాడామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే ఇలా చేస్తున్నారని కొందరు విమర్శిస్తు న్నారన్నారు. హంద్రీనీవా, గాలేరు–నగరి, తోటపల్లి, వంశధార, వెలిగొండ, గుండ్లకమ్మ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసినట్లే పెన్నా నదిని కూడా కలుపుతామన్నారు. ప్రతిపక్షాలు కోరినట్లు తప్పకుండా రక్షకతడిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి నిప్పులాంటి వ్యక్తని స్పష్టం చేశారు.