ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హుజూరాబాద్‌లోని విజయతేజస్విని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలలోని మూడవ అంతస్తులోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హుజూరాబాద్ : హుజూరాబాద్‌లోని విజయతేజస్విని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలలోని మూడవ అంతస్తులోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పోతరాజు చందన(17) విజయతేజస్విని కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలకు వచ్చిన చందన క్లాస్‌కు వెళ్లకుండా కళాశాలలోని మూడవ అంతస్తుపైకి వెళ్లింది. తోటి విద్యార్థులు బాత్‌రూంకు వెళ్లిందని బావించారు. క్లాస్ పూర్తయినా చందన రాకపోవడంతో తోటి విద్యార్థులు పైకి వెళ్లి చూడగా ఓ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వారు కళాశాల యాజమాన్యానికి విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గౌస్‌బాబా, ఎస్సై కోటేశ్వర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చందన మృతికి గల కారణాలను కళాశాల యాజమాన్యాన్ని, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న చందన తల్లిదండ్రులు సంపత్, భవాని సంఘటన స్థలానికి చేరుకుని కూతురు మృతదేహంపై పడి బోరున విలపించారు. అయితే చందన మృతికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినప్పటికి వినిపించుకోలేదు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించారు. చందనకు గత కొన్ని రోజులుగా మానసికస్థితి సక్రమంగా లేని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటేశ్వర్ తెలిపారు.