కనిగిరి: పోరాటాల పురిటి గడ్డ పై మరో తార రాలింది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. కమ్యునిస్టు భావాలతో విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు అలంకరించిన నేత ఇరిగినేని తిరుపతి నాయుడు అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని స్వగృహంలో కన్నుమూశారు. పామూరు మండలం మోపాడు ఇరిగినేని స్వగ్రామం. నర్సలనాయుడు, లక్షమ్మ దంపతులకు 1–07–1937లో ఇరిగినేని తిరుపతినాయుడు జన్మించారు. నాటి కమ్యునిస్టు ఉద్యమనేత గుజ్జుల యల్లమందారెడ్డికి ఇరిగినేని శిష్యుడు. ఇరిగినేని సతీమణి లక్ష్మమ్మ 1959లో మోపాడు సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత కమ్యునిస్టు అభిమానిగానే 1964లో సర్పంచ్‌గా ఎన్నికై, 16 ఏళ్లకు పైగా సర్పంచ్‌గా పనిచేశారు. 1981లో సమితి ఎన్నికల్లో ఇరిగినేని మిత్రపక్షాల అభ్యర్థిగా నిలబడి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోళ్ల తిరుపతినాయుడుపై అత్యధిక మెజార్టీతో సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావంతో 1982లో ఇరిగినేని టీడీపీలో చేరి, జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముక్కు కాశిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరిగినేని ప్రతిపాదించి తన మద్దతునిచ్చారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.రామసుబ్బారెడ్డిపై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పడు ఇరిగినేని కూడా టీడీపీ ఎమ్మెల్యే టికెట్టును ఆశించారు. కానీ టీడీపీ అధిష్టానం కాశిరెడ్డికే టికెట్ ఇచ్చింది. దీంతో ఇరిగినేని టీడీపీకి రాజీనామా చేసి ఏనుగు గుర్తుపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,540 ఓట్లతో ఇరిగినేని పై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఇరిగినేని 1987లో కాంగ్రెస్‌పార్టీలో చేరి, ఆపార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాశిరెడ్డిపై ఇరిగినేని గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఇరిగినేనిపై కాశిరెడ్డి విజయం సాధించారు. తరువాత 1999, 2004 ఎన్నికల్లో రెండు దఫాలు వరుసగా ఇరిగినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండి 2009లో ఉగ్ర నరసింహారెడ్డి గెలుపునకు కృషిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో 2014 ఎన్నికల్లో కదిరిబాబురావుకు తన మద్దతు పలికి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
నిరాడంబర జీవితమే
ఇరిగినేని మార్క్ రాజకీయం :
దాదాపు 40 ఏళ్లకుపైగా రాజకీయ జీవితం గడిపి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవులను అలంకరించినా.. నిరాడంబర జీవితంతో ఇరిగినేనిప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. ఇరిగినేని అనగానే పాతపడిన అద్దె భవనం.. గదిలో నవారు మంచం.. దానిపై పాత దుప్పటి.. మూలన ఓ చిన్నపాటి కూలర్ ఇక్కడి ప్రజలకు గుర్తొస్తుంది. ఎమ్మెల్యే దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా..ప్రత్యర్థి పార్టీ వాడై.. తనకు ఓటు వేయక పోయినా తన వద్దకు వచ్చి సమస్య తెలిపితే కాదనకుండా సాయం చేసే నైజం ఇరిగినేనిది. అందుకే ఆయనను ప్రతిపక్ష పార్టీల వారు సైతం కనిగిరి పెద్దాయనగా పిలుస్తారు.
మాట ఇచ్చిన వారి కోసం ఎందాకైనా..
రాజకీయ, ఉద్యోగ మరే ఇతర విషయాల్లో నైనా సరే.. ఒక్కసారి ఇరిగినేనితో అభయం పొందితే వారి కోసం ఎంతవరకైనా పోరాడి సాధించే నైజం ఆయనది. అందుకే నేటికీ ఇరిగినేనికి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది.
పలువురు ప్రముఖుల నివాళి
ఇరిగినేని తిరుపతినాయుడు భౌతిక కాయాన్ని పలు వురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి, కొండపి ఎమ్మెల్యేలు కదిరిబాబురావు, బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ బీద రవీచంద్రయాదవ్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దివి శివరాం, ఏఎంసీ చైర్మన్‌లు దారపనేని చంద్రశేఖర్, టి.వెంకటేశ్వర్లు, రామయ్య చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి ప్రకాశం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్‌రెడ్డి, కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందురు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు ఎస్‌కే గఫార్, కర్నాటి వెంకటరెడ్డి, కనిగిరి, పామూరు, సీఎస్‌పురం ఎంపీపీలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇరిగినేని స్వగ్రామం మోపాడులో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రజానాయకుడు ఇరిగినేని
ఒంగోలు అర్బన్: ప్రజా మన్ననలు పొందిన నాయకుడు ఇరిగినేని తిరుపతి నాయుడని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇరిగినేని మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ శాసనసభ్యుడు ఇరిగినేని తిరుపతినాయుడు మృతి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరిగినేనితో తమ కుటుంబానికి పాతిక సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.
వైఎస్సార్ తో ఇరిగినేని అనుబంధం..
ఇరిగినేని తిరుపతినాయుడు ఆరంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనిషిగా గుర్తింపు పొందారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగినేని విన్నపం మేరకు 2008 ఆగస్టులో వైఎస్సార్ కనిగిరికి వచ్చి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు రూ.175 కోట్ల కనిగిరి రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మొదటి విడత నిధులు రూ.91 కోట్లు మంజూరు చేశారు. తిరుపతినాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డితో కలిసి కనిగిరి మంచినీటి సమస్య పరిష్కారానికి, పేదలకు పక్కాగృహాల నిర్మాణానికి కృషి చేశారు.
ఇరిగినేని కన్నుమూత
Published Mon, Feb 13 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
Advertisement
Advertisement