శంషాబాద్ లో ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాది అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ జోసెఫ్ అనే ఉగ్రవాదిని పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొయినుద్దీన్తో కలిసి ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్కు రప్పించారు.
ఇప్పుడు అరెస్టు చేసిన తర్వాత.. ఆమెకు హైదరాబాద్లో ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరికి ఆమె ఎర వేసిందనే వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తూ ఇప్పటివరకు 30 మందికి పైగా వ్యక్తులు శంషాబాద్లో అరెస్టయ్యారు. కోల్కతా నుంచి కూడా కొంతమంది గతంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా అరెస్టుతో కొంతవరకు దీనికి అడ్డుకట్ట పడినా.. ఇంకా ఏయే మార్గాల ద్వారా వెళ్తున్నదీ తెలుసుకోవాల్సి ఉంది. దానికి ఈమె అందించే సమాచారం కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.