‘మామూళ్లు’ మామూలే!
‘మామూళ్లు’ మామూలే!
Published Sun, Oct 9 2016 9:12 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
* దసరా వసూళ్ల వేటలో ఎక్సైజ్, వాణిజ్య సిబ్బంది
* హెచ్చరికలు బేఖాతరు
* పట్టించుకోని ఉన్నతాధికారులు...ఆందోళనలో వ్యాపారులు
నరసరావుపేట టౌన్: ‘దసరా మామూళ్లు నిషేధించాం... ఏ శాఖవారైనా వసూలు చేస్తే చర్యలు తీసుకొంటాం’ అంటూ ప్రభుత్వం ప్రతిసారి చెబుతున్నా పరిస్థితి మారటంలేదు. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ ‘పని’లో తాము ఉంటున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే... నరసరావుపేటలో గత పదిరోజులుగా దసరా మామూళ్ల పేరిట అక్రమదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు ఉన్నతాధికారుల ఉదాశీనత, మరికొందరు అధికారుల ప్రోత్సాహంతో సిబ్బంది విధులు పక్కన పెట్టి మామూళ్ల వేటలో పడ్డారు. ముఖ్యంగా రెండు ప్రభుత్వ కీలక శాఖలైన ఎక్సైజ్, వాణిజ్య శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది చెలరేగిపోతుండడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలో గత పదిరోజులనుంచి ఆ రెండు శాఖలకు చెందిన సిబ్బంది దసరా మామూళ్ళపేరిట వ్యాపారుల నుంచి అందినంత దండుకుంటున్నారు. డబ్బులు తరువాత ఇవ్వండి...ఎంత ఇచ్చేది రాయండి అంటూ ముద్రించిన రశీదుపుస్తకాలపై దర్జాగా రాయించుకుంటున్నారు. వాటిని చూపించి ‘అందరూ మామూళ్లు ఇస్తున్నారు... మీరుకూడా ఇవ్వాలంటూ’ ఒత్తిడి తెచ్చి తీసుకుంటున్నట్లు కొందరు వ్యాపారులు వాపోతున్నారు. గతంలో దసరామామూళ్లు నిషేధమని కార్మికశాఖ ప్రతిదుకాణంలో బోర్డులు ఏర్పాటుచేసింది. అదేవిధంగా పలు అసోసియేషన్‌లు దసరామామూళ్ల నిషేధంపై తీర్మానాలు చేశాయి. అయినప్పటికీ సిబ్బంది ఒత్తిడితో ఇచ్చుకోక తప్పడంలేదని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు.
డివిజన్‌వ్యాప్తంగా వసూళ్ళు..
డివిజన్ స్థాయి ఎక్సైజ్, వాణిజ్య శాఖల కార్యాలయాలు నరసరావుపేట పట్టణంలో కొనసాగుతుండటంతో ఆశాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది డివిజన్‌లోని మద్యం, ఇతర వ్యాట్, టీఓటీ లైసెన్స్‌లు కలిగిన వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నూతనంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారి నుంచి అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడంతో ఎంతోకొంత ముట్టచెప్పాల్సి వస్తోందంటూ కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని చెప్పారు. అదేవిధంగా సీటీఓ మంజులరాణి దృష్టికి తీసుకు వెళ్లగా సిబ్బంది దసరామామూళ్లకు పాల్పడినట్టు తేలితే చర్యలు తీసుకొంటామని తెలిపారు.
Advertisement