నా మాటలు సాఫ్ట్‌వేర్..రూపం హార్డ్‌వేర్..
నా మాటలు సాఫ్ట్‌వేర్..రూపం హార్డ్‌వేర్..
Published Wed, Apr 26 2017 10:45 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
-స్నేహమే సినిమాల్లోకి రప్పించింది
– హాస్యనటుడు రఘు కారుమంచి
రాయవరం(మండపేట) : ఆయన ఆంధ్రాకు చెందిన వాడైనా..పెరిగింది తెలంగాణలోనే. అందుకే డైలాగులు పూర్తిగా తెలంగాణ యాసతో చెపుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ..అనుకోకుండా సినీ నటుడిగా మారానంటున్నారు ప్రముఖ హాస్య నటుడు రఘు కారుమంచి. స్నేహమే తనను సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేయించిందంటున్న రఘు నటుడికి ట్రిపుల్ ‘టి’తో ప్రోత్సాహం ఉండాలంటున్నారు. రాయవరం సాయితేజా విద్యానికేతన్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సినీ ఫీల్డ్‌కు వస్తానని ఊహించలేదు..
ఎంబీఏ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి చీఫ్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడిని. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆఫీస్ నిర్వహిస్తుండేవాడిని. వీవీ వినాయక్, సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ దర్శకులుగా ఉంటూ అదే అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. ప్రతి రోజూ కలుసుకోవడంలో మా మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేశాను. ‘నేను దర్శకుడినయ్యాక నీకు వేషమిస్తా’నన్న వినాయక్ ‘ఆది’ సినిమాతో ఆ మాట నిలబెట్టుకున్నారు.
‘అదుర్స్’ తర్వాత ఉద్యోగానికి రాజీనామా..
‘అదుర్స్’ సినిమా నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 2010 వరకు జాబ్ చేస్తూనే నటిస్తుండేవాడిని. అప్పటి వరకు 30–40 సినిమాల్లో నటించాను. 2010 జనవరి తర్వాత 2016 వరకు 110 సినిమాలు చేశాను. ‘ఆది’ రిలీజయ్యాక ఏ రోజూ వేషం కావాలని ఎవ్వరినీ అడగలేదు. జాబ్ చేసుకుంటుండగానే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వృత్తిపరంగా నా మాటలు సాఫ్ట్‌వేర్‌గా ఉన్నా..నా రూపం హార్డ్‌వేర్‌గా ఉంటుంది. అదే ప్రేక్షకులకు దగ్గర చేసింది.
ప్రతి వృత్తిలోనూ స్ట్రగుల్ ఉంటుంది..
ప్రతి వృత్తిలోనూ జాబ్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. సినిమా రంగం మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈ రంగంలోకి వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు 170కి పైగా సినిమాల్లో నటించాను. టీవీ రంగంలో 1500 వరకు ఎపిసోడ్‌లు చేశాను. తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నటించాను.
ట్రిపుల్ ‘టి’తో పాటు ప్రోత్సాహం అవసరం..
నటుడికి టాలెంట్, టైమ్, టైమింగ్ అవసరం. ఈ మూడింటితో పాటు ప్రోత్సాహం ఉండాలి. నాకు లభించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను. కామెడీ నటుడిగా ప్రేక్షకులను అలరించాను. అయితే విలన్‌గా నటించి ప్రేక్షకులను మరింత మెప్పించాలనుంది. ప్రస్తుతం తెలుగులో 10 సినిమాలు, కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను.
Advertisement
Advertisement