వీడికి జైలు.. అత్తారిల్లే !
పోలీసు అంటే వీడేరా.. అనే విధంగా హేర్ కటింగ్.. నాజూకైన మీసాలు.. మఫ్టీ పోలీసు తరహాలో టీషర్టు, జీన్స్‌ఫ్యాంటు ధరించి ఉదయం, సాయంత్రం వేళల్లో నగర శివారుల్లో సంచరిస్తుంటాడు.
- 60 కేసుల్లో నిందితుడు
- 11 సార్లు అరెస్ట్, బెయిల్‌పై విడుదల
- ప్రేమ జంటలు కనిపిస్తే పండుగే
- పోలీసునంటు బెదిరించి నగలు, సొమ్ము దోపిడీ
- నకిలీ పోలీసు నాగేంద్ర మళ్లీ దొరికాడు
- 24 తులాల బంగారు ఆభరణాలు రికవరీ
పోలీసు అంటే వీడేరా.. అనే విధంగా హేర్ కటింగ్.. నాజూకైన మీసాలు.. మఫ్టీ పోలీసు తరహాలో టీషర్టు, జీన్స్‌ఫ్యాంటు ధరించి ఉదయం, సాయంత్రం వేళల్లో నగర శివారుల్లో సంచరిస్తుంటాడు. మాటు వేసి ప్రేమ జంటల కోసం గంటల తరబడి నిరీక్షిస్తాడు. తాను మఫ్టీ పోలీసునంటూ ప్రేమ జంటలను బెదిరించి, వారి వద్ద ఉన్న నగదు, నగలు, సెల్‌ఫోన్లు లాక్కొని ఉడాయిస్తుంటాడు. అతడెవరో ఇప్పటికే గర్తొచ్చుంటుంది. కర్నూలు నగర శివారుల్లోని ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్న గొర్లగుట్ట నాగేంద్రకుమార్. దాదాపు 60 కేసుల్లో ఇతను నిందితుడు. అత్తారింటికి వెళ్లినంత సులువుగా జైలుకెళ్లి బెయిల్‌పై రావడం.. మళ్లీ నేరాలకు పాల్పడటం వీడి నైజం. 11సార్లు పట్టుబడి జైలుకెళ్లినా మారలేదు. బెయిల్‌పై బయటకు వచ్చి తన పంథాను మార్చుకోలేదు. దోపీడీ సొమ్మును అమ్ముతుండగా పోలీసులు మళ్లీ పట్టుకున్నారు.
- కర్నూలు
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన నాగేంద్రకుమార్ చిన్నప్పటి నుంచే నేరాల బాటపట్టాడు. జైలులో పరిచయమైన కొందరి దొంగలతో జతకట్టి బేతంచెర్ల, డోన్, వెల్దుర్తి, కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిల్లో ఇటీవల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. బేతంచెర్ల సీఐ కంబగిరిరాముడు, ఎస్‌ఐ తిరుపాలు నేతృత్వంలో నాగేంద్రకుమార్‌ను అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా నేరాల చిట్ట బయటపడింది. దాదాపు రూ.8.35 లక్షల బంగారు ఆభరణాలను దోపిడీ చేయగా, రూ.6.70 లక్షల విలువగల 24 తులాల బంగారు నగలను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకొని శుక్రవారం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్నూలు శివారుల్లోని జగన్నాథగట్టు, వెంగన్నబావి, వెంకటరమణకాలనీ పంప్‌హౌస్, పుల్లారెడ్డి కాలేజి, సఫా కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు.
ప్రేమ జంటలు కనిపించగానే తాను పోలీసునని చెప్పి డబ్బులు, ఆ భరణాలు దోచుకుంటాడు. ఈ విధమైన నేరాల్లో అనేక సార్లు జైలుకు వెళ్లినా అతనిలో మార్పు రాలేదు. జైలులో పరిచయమైన అనంతపురం వాసులు జొన్నగడ్డల ప్రభాకర్, గంగాధర్‌తో ముఠాగా ఏర్పడి బేతంచెర్ల, గొర్లగుట్ట ప్రాంతాల్లో 2016 డిసెంబరు, 2017 జనవరి, మార్చి మాసాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఇతని వాటా కింద వచ్చిన దోపిడి సొమ్మును డోన్‌లో విక్రయిస్తుండగా, పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్, తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఇంకా పలు కేసులు ఉన్నాయి. వాయిదాల ప్రకారం కోర్టుకు హాజరవుతుంటాడు. ఇతనితో జతకట్టి చోరీలకు పాల్పడిన అనంతపురం వాసులు జొన్నలగడ్డ ప్రభాకర్, గంగాధర్‌ల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, త్వరలో వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి భారీ మొత్తంలో సొమ్మును రికవరీ చేసినందుకు బేతంచెర్ల హెడ్ కానిస్టేబుళ్లు గోవిందనాయక్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పెద్దయ్య, శ్రీనివాసులు, నందునాయక్, రామలక్ష్మణ్ తదితరులను ఎస్పీ అభినందించారు.