ఆశలపై నీళ్లు.. హామీలకు కాళ్లు | janmabhoomi maa ooru completed | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు.. హామీలకు కాళ్లు

Published Wed, Jan 11 2017 11:32 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

ఆశలపై నీళ్లు.. హామీలకు కాళ్లు - Sakshi

ఆశలపై నీళ్లు.. హామీలకు కాళ్లు

ముగిసిన నాలుగో విడత జన్మభూమి 
ప్రచారం ఎక్కువ.. ప్రయోజనం తక్కువ
ప్రజలకు  సక్రమంగా అందని సంక్షేమ ఫలాలు
పలుచోట్ల ఎమ్మెల్యేలను ప్రతిఘటించిన జనం
సాక్షిప్రతినిధి, కాకినాడ : అట్టహాసంగా 10 రోజులపాటు నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి బుధవారంతో ముగిసింది. మూడు విడతల్లో జరిగిన జన్మభూమిలో అందని ఫలాలు నాలుగో విడతలో దరిచేరతాయని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు పెట్టుకున్న ఆశలపై సర్కార్‌ నీళ్లు చల్లింది. ప్రజల నిరసనలు, బహిష్కరణలు, ఆగ్రహ జ్వాలల మధ్య జన్మభూమి సభలు ముగిశాయి. సభల విజయవంతమవ్వాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలు జన్మభూమిలో పంపిణీ చేస్తారని నమ్మించి జన్మభూమి కమిటీల సభ్యులు ప్రతి నియోజకవర్గంలోను గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాన్ని తరలించారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నాలుగో విడత జన్మభూమి ఈ నెల 2న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ రూరల్‌లో ప్రారంభించగా, సీఎం చంద్రబాబునాయుడు రామచంద్రపురం జన్మభూమి సభలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలపై జనాగ్రహం
దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్‌కార్డులు, అన్ని రకాల పింఛన్‌లు, ఇతర సంక్షేమ ఫలాలు జన్మభూమిలో అందజేస్తామని అధికార పార్టీ ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పటి వరకు ముచ్చటగా మూడు విడతలు జన్మభూమి సభలు జరుగగా, గురువారం నాలుగో విడత కూడా అదే పంథాలో మమ అనిపించేశారు. జనం మాత్రం నాలుగో విడతలో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూశారు. జన్మభూమిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పరిష్కరిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఆచరణలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసినా అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్టు అయినా లేదు. చివరకు డిమాండ్‌లు పరిష్కరించండి అని అడిగినవారి గొంతు నొక్కేందుకు సైతం వెనుకాడలేదు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహాన్ని చవిచూశారు.
‘సాక్షి’పై అక్కసు
కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులైతే అత్తమీద కోపం దుత్త మీద చూపిన చందాన జన్మభూమిలో లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో వాస్తవాలకు అద్దం పట్టిన ‘సాక్షి’ దినపత్రికపై అక్కసు వెళ్లగక్కారు. ఇందుకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అ«ధికార పార్టీలో రెండు వర్గాలు ఒక పోస్టు కోసం గొడవ పడిన విషయానికి అక్షర రూపమిచ్చిన సాక్షి పత్రికపై ఎమ్మెల్యే అక్కసు వెళ్లగక్కారు. ప్రజలు తిరగబడతారనే భయంతో పలువురు ఎమ్మెల్యేలు పోలీసు బందోబస్తుతో వెళ్లాల్సి వచ్చింది. ఆ జాబితాలో ప్రత్తిపాడు, అమలాపురం, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, రాజానగరంæ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, అయితాబత్తుల ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్‌లున్నారు. వీరంతా పోలీసు బందోబస్తు లేకుండా పలు ప్రాంతాల్లో జన్మభూమికి వెళ్లలేకపోయారు. ప్రజల సమస్యలకు సమాధానాలు చెప్పలేక మధ్యలోనే జారుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌లు పంపిణీ చేస్తామని అధికారులు జన్మభూమికి ముందు ఊదరగొట్టేశారు. తీరా ఆచరణకు వచ్చేసరికి జన్మభూమి సభల్లో పింఛన్‌లు పంపిణీ చేసిన దాఖలాలు కన్పించలేదు.
కొన్నిచోట్ల టీడీపీ కార్యక్రమంలా
జన్మభూమి సభల్లో ప్రజల నుంచి వస్తోన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతాయని ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యేలు ఆ సభలకు వెళ్లకుండా అధికారులను పంపించి మమ అనిపించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి పరిష్కారం కాని సమస్యలపై నిలదీసే సందర్భాల్లో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీల ద్వారా గొడవలు చేయించి అడ్డుతగిలారు. కొత్తపేట, ముమ్మిడివరం తదితర నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద వంటి వారు జన్మభూమి సభలకు ఆధ్వర్యం వహించడం ద్వారా జన్మభూమిని పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement