జవహర్‌కు చోటు.. సుజాతకు ఉద్వాసన
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రాష్ట్ర మంత్రి వర్గంలో కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన పీతల సుజాతకు ఉద్వాసన పలికిన చంద్రబాబు నాయుడు ఆమె స్థానంలో అదే వృత్తి నుంచి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఎస్ జవహర్‌కు పట్టం కట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారనే దానిపై శనివారం అర్ధరాత్రి వరకూ హైడ్రామా నడిచింది. అదివారం ఉదయం 9,22 గంటలకు మంత్రి వర్గ విస్తరణ ముహూర్తాన్ని నిర్ణయించినా అర్ధరాత్రి వరకూ కసరత్తుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైడ్రామా నడిపారు. దీంతో అశావాహులు మంత్రివర్గ జాబితాలో తమ పేరు ఉంటుందన్న ఆశతో ఎదురుచూశారు. పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పీతల సుజాతను మంత్రివర్గంలో కొనసాగిస్తారంటూ వార్తలు వచ్చాయి. చివరకు అమె పదవిని వదులుకోక తప్పలేదు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేశారు. చినబాబు లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో తనకు పదవి వస్తుందని ఆయన ఆశించారు. దీనికోసం ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్దఎత్తున ముఖ్యమంత్రిని కలిశారు. అయితే కుల సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పడంతో అదే సామాజిక వర్గం వారందరూ తమ రెండో ఆప్షన్‌గా జవహర్ పేరు చెప్పడంతో అతనికి పదవి దక్కినట్టు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్‌బాబుపై అరోపణల నేపథ్యంలో అతని పదవి పోవడంతో ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన జవహర్‌కు చోటు దక్కింది. మరోవైపు ఎస్టీ కోటాలో ఇప్పటివరకూ ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తెలుగుదేశం తరపున ఎస్టీ శాసనసభ్యునిగా పోలవరానికి చెందిన మొడియం శ్రీనివాస్ ఒక్కరే గెలిచారు. దీంతో అతనికి మంత్రి పదవి ఖరారు చేసినట్టు ప్రచారం సాగింది. పార్టీ కార్యాలయం నుంచి కూడా అందుబాటులో ఉండాలంటూ సమాచారం వచ్చింది. చివరి నిముషంలో ఆయనకు పదవి దక్కలేదు. మరోవైపు మైనారిటీ కోటా కింద నరసాపురానికి చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌కు చోటు దక్కిందని ప్రచారం సాగినా చివరకు ఆయనకు పదవి రాదని తేలిపోయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేరు కూడా చర్చకు వచ్చింది. సీనియర్ నేత అయిన పితానికి బీసీ కోటాలో తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. కాపు సామాజిక వర్గం తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టిబలిజ కులానికి చెందిన పితానికి పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో పితాని సత్యనారాయణముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. చివరి నిమిషంలో పితానికి చోటు దక్కింది. ఇదిలావుంటే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)కూ స్థానం దక్కవచ్చని ప్రచారం జరిగినా ఇటీవలే అదే సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజుకు ఎమ్మెల్సీ రావడం, శివ కుటుంబ సభ్యులకు వెమ్ ఏరోసిటీ ప్రాజెక్టు దక్కడంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.