జేఎన్‌టీయూ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
► తొలుత ఆ స్థలంలో పారిశ్రామికవాడంటూ ఉత్తర్వులు జారీ
► విపక్షాల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : ఇచ్చిన హామీలను విస్మరించడం..స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారడం ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. నరసరావుపేట వద్ద గతంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించిన భూమిని పారిశ్రామిక వాడకు కేటాయిస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి జూన్ ఆరో తేదీ నాటికి యూటర్న్ తీసుకుంది. అదే భూమిని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది.
పల్నాడులో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు శతాబ్ది ఉత్సవాల సమయంలో హామీ ఇచ్చారు. ఆ ఉత్తర్వులు రాక ముందే కళాశాలకు సేకరించిన భూమిని పారిశ్రామికవాడగా గుర్తిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 21న మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వెనుక పారిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి లక్షలు దండుకునేందుకు నరసరావుపేట నియోజకవర్గ ముఖ్యనేత తనయుడు కీలక భూమిక పోషించినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి.
కాసు హయాంలోనే ప్రయత్నాలు
ఇక్కడ జేఎన్‌టీయూ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్ తులసీరామచంద్ర ప్రభు తదితరులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సహకరించారు. గుంటూరు జిల్లా యంత్రాంగం 76 ఎకరాలను సేకరించగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సానుకూలంగా నివేదిక పంపారు.
ఇక ప్రభుత్వ ఉత్తర్వులు రావడమే తరువాయి అన్న తరుణంలో సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు మరుగున పడింది. నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటుకు సత్వరం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందుకు భిన్నంగా ఆ కళాశాలకు కేటాయించిన భూమికి అదనంగా మరో 32 ఎకరాలను కలుపుతూ 108 ఎకరాలను పారిశ్రామికవాడగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోటలో వ్యూహం
ఆ భూమిని పారిశ్రామికవాడగా గుర్తించడం వెనుక పెద్ద పన్నాగమే ఉందని విమర్శలు వచ్చాయి. విద్యా సంస్థకు ఆ భూమిని కేటాయించడంతో పెద్దగా లాభం ఉండదనే ఉద్దేశంతో నరసరావుపేట నియోజకవర్గ ముఖ్యనేత తనయుడు దానిని పారిశ్రామిక వాడకు కేటాయించే విధంగా ఉత్తర్వులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపించాయి.