జంబ్లింగ్‌తో విద్యార్థులకు తీవ్ర నష్టం
జంబ్లింగ్‌తో విద్యార్థులకు తీవ్ర నష్టం
Published Sat, Sep 17 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య
నరసరావుపేట : ప్రభుత్వం నూతనంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశపెట్టాలనుకునే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలలో జంబ్లింగ్ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. విద్యావిధానంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టే జంబ్లింగ్ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. శనివారం పలనాడురోడ్డులోని కాన్ఫరెన్స్ హాలులో విలేకర్ల సమావేశంలో ఆయన తన కార్యవర్గ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. హైదరాబాదులో తమతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టంచేశామని, దీనికి ప్రిన్సిపల్ కార్యదర్శి సమ్మతించారన్నారు. అకడమిక్ కాలెండర్ ప్రకారం 220 రోజుల పనిదినాల్లో పదోతరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహణకు 15 రోజులు, వాల్యుయేషన్‌కు పదిహేను రోజుల చొప్పున 30రోజులు తరగతులు నిర్వహించలేకపోవటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు 190 రోజులే మిగులుతున్నాయన్నారు.
క్వార్టర్లీ, హాఫర్లీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం పెట్టి మండల స్థాయిలో వాల్యుయేషన్ నిర్వహించటం వలన రెండు పరీక్షలతో మరో 30రోజులు ఉపాధ్యాయులు వాల్యుయేషన్‌కు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో విద్యార్థులకు విద్యను బోధించేందుకు కేవలం 160రోజులే మిగులుతుందన్నారు. ప్రభుత్వం విద్యేతర కార్యక్రమాలకు కొన్నిరోజులు ఉపయోగించుకుంటుందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దటంలో ఉపాధ్యాయులు తలోరకంగా మార్కులు వేయటం వలన విద్యార్థులకు నష్టం చేకూరుతుందన్నారు. బార్ కోడింగ్ విధానం లేకుండా పేపర్లు దిద్దటం కోసం మండలాలు మార్చటం వలన ఎవరి పేపర్లు ఎవరివి అనేది తేలికగా తెలుస్తుందన్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యాసంస్థల మధ్య విభేదాలు పొడచూపుతాయని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో పనిదినాలు వృధా కావటం తప్పితే నూతనంగా విద్యార్థులకు లభించే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అందువలన జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, విద్యాసంస్థల అధిపతులు జి.రాజగోపాలరెడ్డి, (ఆక్స్‌ఫర్డ్), గడ్డం భూపాల్‌రెడి ్డ(నవభారత్ హైస్కూల్), జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, బోడెపూడి శ్రీనివాసరావు, పి.యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement