తాటిపాడు(జూపాడుబంగ్లా): తాటిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం–1 ట్రయల్ రన్‌ను బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎంపీపీ మంజులయాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు రాయపుపెద్దరంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి, డీఈ తిమ్మయ్యలు మాట్లాడుతూ జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో రన్నింగ్ అయితే మండలంలోని తంగెడంచ, 80బన్నూరు, పారుమంచాల, పి.లింగాపురం, తరిగోపుల గ్రామాల్లోని 7,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం జూపాడుబంగ్లా–2 ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో రన్నింగ్ అవుతుండగా 2,750 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు డీఈ తిమ్మయ్య తెలిపారు. జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం కింద 49 డిస్ట్రిబ్యూటరీలకుగాను 35 పూర్తికాగా ఇంకా 15 పూర్తికావాల్సి ఉందన్నారు. పనులు పెండింగ్‌లో ఉన్నందున 1500ఎకరాలకు సాగునీటని అందించే అవకాశాలున్నాయన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌నాటికి జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీటిని అందిస్తామని డీఈ వివరించారు. పెండింగ్‌లో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఈనెలాఖరులోగా పూర్తిచేసి త్వరలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు మాండ్ర తెలిపారు.