ఇవే చర్యలు ముందు తీసుకుంటే ...
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో భక్తులపై పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు కుటుంబ సభ్యులతో కలసి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం జ్యోతుల నెహ్రు విలేకర్లతో మాట్లాడారు. పుష్కరాలలో అధికారుల వైఖరిపై మండిపడ్డారు. అధికారులు పనితీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు.
ప్రస్తుతం అధికారులు చేపడుతున్న చర్యలు పుష్కరాల ప్రారంభ సమయంలో కూడా తీసుకుని ఉంటే అంతటి ఘోరం జరిగేది కాదన్నారు.పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ముద్ర వేసుకోవడానికి యత్నించి విఫలమయ్యారని జ్యోతుల నెహ్రు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద భక్తుల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే.