కామారెడ్డి: అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరిన వారి టూరిస్టు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి పట్టణం, రాజంపేట, మద్దికుంట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 30మంది అమర్‌నాథ్ యాత్రకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు.
గురువారం సాయంత్రం జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా కుల్‌గా జిల్లా ఖాజీగఢ్ ప్రాంతంలో బస్సులో సిలిండర్ పేలింది. తొమ్మిదిమందికి గాయాలు కాగా, వారు అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సదాశివనగర్ జెడ్పీటీసీ రాజేశ్వర్ రావు ఈ విషయాన్ని జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర అధికారులకు సమాచారం అందించారు. తమ వారి పరిస్థితిపై ఆయా కుటుంబాల వారు ఎప్పటికప్పుడు ఫోన్‌లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు.