ఉద్యమానికి అండగా మేమున్నాం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాపు ఉద్యమానికి అండగా నిలబడతామని కాపు న్యాయవాద జేఏసీ నాయకులు సృష్టం చేశారు. కాకినాడ సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక‌్షన్ హాలులో రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల న్యాయవాద జేఏసీ సదస్సు ఆదివారం నిర్వహిం
- కాపు న్యాయవాద జేఏసీ భరోసా
- పిల్లల భవిత కోసమే ఈ సమరమన్న ముద్రగడ
- కాకినాడ సదస్సుకు తరలివచ్చిన కాపు న్యాయవాదులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాపు ఉద్యమానికి అండగా నిలబడతామని కాపు న్యాయవాద జేఏసీ నాయకులు సృష్టం చేశారు. కాకినాడ సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక‌్షన్ హాలులో రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల న్యాయవాద జేఏసీ సదస్సు ఆదివారం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ, ప్రభుత్వం కాపు కులాన్ని అణచివేసే ధోరణితో ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమ బాట తప్పదన్నారు. ఉద్యమం చేస్తున్నవారిపై ప్రభుత్వం పెట్టే కేసులను తామే వాదిస్తామని, కోర్టు ఖర్చులు కూడా తామే భరిస్తామని, కాపు న్యాయవాదులు భరోసా ఇవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు.
కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానా«త్ మాట్లాడుతూ, 1912 నుంచి 1956 వరకూ కాపులను బీసీలుగానే పరిగణించారన్నారు. తమకు గతంలో ఉన్న రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయమంటున్నామని, కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదని అన్నారు. ప్రభుత్వం కాలయాపన చేసేందుకే మంజునాథ కమిషన్ వేసిందని అన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.చిదంబరం మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు మాట్లాడుతూ, ఉద్యమం చేస్తున్న ముద్రగడ కుటుంబంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమను కలచివేసిందన్నారు. ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లాలో 144, 30వ సెక‌్షన్లను నిరంతరం అమలు చేయడంపై న్యాయపోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీనియర్ న్యాయవాది బాలకృష్ణ మాట్లాడుతూ, కాపు కులానికి చెందిన 66 శాతం మంది కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం దీనిని గుర్తించి వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ, కాపు జాతిని అన్ని రంగాల్లోనూ ముందుంచడానికి కృషి చేయాలన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, గతంలో ఉన్న రిజర్వేషన్లనే పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. కాపు ఉద్యమంలో ఎవరి కర్తవ్యం ఏమిటో ఎవరికివారు ఆలోచించుకుని ముందుకు సాగాలన్నారు. కాపు జేఏసీ నాయకుడు వీవై దాసు మాట్లాడుతూ, ఉద్యమానికి మద్దతు ప్రకటించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు న్యాయవాద జేఏసీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వెయ్యిమంది న్యాయవాదులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాపు ఉద్యమ జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, బసవా ప్రభాకరరావు, ఆర్‌వీజేఆర్ కుమార్, పసుపులేటి చంద్రశేఖర్, సంగిశెట్టి అశోక్, బసవా ప్రభాకరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.