
కాపు మంత్రులను కులం నుంచి బహిష్కరిస్తున్నాం
కాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన రాజప్ప, పి.నారాయణను కాపు కులం నుంచి...
కాపు నేత చింతాల వెంకట్రావు
కావలి : కాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన రాజప్ప, పి.నారాయణను కాపు కులం నుంచి బహిష్కరిస్తున్నామని కాపు నేత చింతాల వెంకట్రావు చెప్పారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఆయన నివాసంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రిలే దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముద్రగడ ఉద్యమంలో అనుమానం ఉందంటూ గంటా, చినరాజప్ప, నారాయణ మాట్లాడటం దారుణమన్నారు. కాపులను బీసీల్లోకి చే ర్చేంత వరకు ముద్రగడతోనే తామంతా ఉండి ఉద్యమాన్ని శాంతియుతంగా బలోపేతం చేస్తామన్నారు. కాపు ఉద్యమ మహిళ నేత మెతుకు రాజేశ్వరి మాట్లాడుతూ గతంలో తమ జాతినేత వంగవీటి మోహనరంగాను కోల్పోయామని, ఇప్పుడు మా ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేమన్నారు.
కాపుల దీక్షకు వైఎస్సార్‌సీపీ మద్దతు
చింతాల వెంకట్రావు నివాసంలో కాపు నేతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ, డీఆర్‌యూసీసీ సభ్యులు కుందుర్తి కామయ్య, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, నేతలు శ్రీహరిరెడ్డి, యల్లంటి ప్రభాకర్, జనిగర్ల మహేంద్ర యాదవ్ దీక్ష స్థలికి చేరి కాపులకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు కాపు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామన్నారు.
కాపు నేతల అరెస్ట్
చింతాల వెంకట్రావు నివాసంలో కాపు నేతలు మెతుకు రాజేశ్వరి, నున్నా వెంకటరావు, తోట శేషయ్య, వెంకయ్య, పసుపులేటి వెంకటేశ్వర్లు, ఇంటూరి శ్రీహరి, పాలడుగు వెంకటేశ్వర్లు, పసుపులేటి పద్మ, రమణతో పాటు పలువురు కాపు నేతలు రిలే దీక్షలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కావలి 1వ పట్టణ సీఐ వెంకటరావు, ఎస్‌ఐ రామ్మూర్తి, తమ సిబ్బందితో వచ్చి కాపు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. వ్యక్తిగత పూచిపై విడుదల చేశారు.