కాపు వెబ్‌సైట్ ప్రారంభం
అమలాపురం టౌన్ (అమలాపురం) : కాపు వెల్ఫేర్ డాక్‌కామ్ అసోసియేషన్ రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా అందించే ఉచిత సేవలను కాపు యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌లోని ఐబీఎం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి డాక్టర్ యాళ్ల శ్రీనివాసవరప్రసాద్ కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం, ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డ సుమారు రెండు కోట్ల మంది కాపులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చే ప్రయత్నంగా ఈ వెబ్‌సైట్ ప్రారంభించినట్టు చెప్పారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్‌లో కాపు విద్యావంతులతో సోమవారం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 22న జిల్లాకు వస్తున్న మంజునాథ కమిషన్‌కు ఈ వెబ్‌సైట్ ద్వారా కాపుల మనోభావాలు, ఆవేదనను తెలియజేయనున్నట్టు చెప్పారు. ఈ వెబ్‌సైట్‌లో కాపులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు. త్వరలో కాపు వెల్ఫేర్ డాట్‌కాం మొబైల్ హెల్ప్ పేరుతో మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైటులో 1.50 లక్షల మంది కాపుల వివరాలను పొందుపరిచానని చెప్పారు. kapuwelfare.comకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కాపు మిత్ర టీమ్ కన్వీనర్ బండారు రామమోహనరావు, కాపు ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు నంధ్యాల నాయుడు, కాపు మిత్ర టీమ్ సభ్యులు కరాటం ప్రవీణ్, నిమ్మకాయల సురేష్, ముత్యాల శరత్‌బాబు, మద్దింశెట్టి రాంబాబు, నిమ్మకాయల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.