హిందీలో కేసీఆర్ ప్రసంగం..
గజ్వేల్: మిషన్ భగీరథ మహోన్నత కార్యక్రమమని, వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటిఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణకు ఈ రోజు శుభదినమని పేర్కొన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కేసీఆర్ ప్రశంసల్లో ముంచెత్తారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నానని అన్నారు. సభలో కేసీఆర్ హిందీలోనే ఎక్కువసేపు మాట్లాడారు. కోమటిబండలో పలు అభివృద్ధి పథకాలను మోదీ ప్రారంభించిన అనంతరం ఆయనతో కలసి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్తో పాటు గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, అనంతకుమార్, సురేష్ ప్రభు, పీయూష్ గోయెల్, రాష్ట్ర మంత్రులు సభలో పాల్గొన్నారు.
సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిస్తోందని, రాష్ట్రాల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన సాగుతోందని, ఈ ఘనత ప్రధానిదేనని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధిచెందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రధాని అభిమానం చూపాలని, అవసరమైనపుడు కేంద్రం సాయం కోరుతామని చెప్పారు. ఐటీఐఆర్, ఎయిమ్స్కు ప్రధాని ఆశీస్సులు కావాలని, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కేటాయించాలని కోరారు. 2009లో మోదీని తొలిసారి కలిశానని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రావాలని అడిగిన వెంటనే మోదీ అంగీకరించారని, వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాని అన్నారు.