మీ ప్రేమ కావాలి
మిషన్ భగీరథ సభలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్
సాక్షి, సంగారెడ్డి: తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రూ.50 వేల కోట్లు, లక్ష కోట్లు కావాలని అడగడం లేదని... తెలంగాణపై ప్రేమ చూపిస్తే చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో వెనుకబడిన నిరుపేదలే ఎక్కువగా ఉన్నారని.. ఇక్కడ చేపట్టే ప్రతి పనిలో ప్రేమ, సహకారం, ఆశీర్వాదాలు కావాలని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో సాగునీటి సమస్యను అధిగమించడానికి ఒక జాతీయ ప్రాజెక్టునైనా కేటాయించాలని, రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐఎంలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మంజూరైన ఐటీఐఆర్‌ను త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినం. రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. ఉత్తర తెలంగాణ ప్రజల కల అయిన కొత్తపల్లి (కరీంనగర్)-మనోహరాబాద్ (హైదరాబాద్) రైల్వేలైన్ కు శంకుస్థాపన జరగడం ఎంతో సంతోషంగా ఉంది..’’ అని పేర్కొన్నారు.
పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినందుకు, తెలంగాణలోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు మంజూరు చేశారని, మోదీ ప్రభుత్వం వల్లే తెలంగాణలో జాతీయ రహదారుల శాతం పెరిగిందని కొనియాడారు. ప్రాజెక్టులకు హడ్కో రుణం మంజూరుకు సహకరించిన వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు చెప్పారు. దేశంలో గత 40 ఏళ్లలో అవినీతి రహిత పాలన సాగినది కేవలం మోదీ రెండేళ్ల పాలనలోనేనని.. మచ్చలేని స్వచ్ఛమైన పాలన మోదీ ప్రభుత్వానిదని కొనియాడారు. తెలంగాణకు అనేక విషయాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తోందన్నారు.
తెలంగాణపై ప్రేమ చూపండి
బీజేపీ సహకారంతోనే తెలంగాణ కల సాకారమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2009లో పంజాబ్‌లోని లుథియానాలో తొలిసారిగా మోదీని కలిశానని గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు తెలంగాణ పోరాటం ధర్మ యుద్ధమని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నేను బాధ్యత గల ముఖ్యమంత్రిని. మాకు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు కావాలి, లక్ష కోట్లు కావాలని కోరబోం. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. తెలంగాణలో వెనుకబడిన నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు.
ఇక్కడ చేపట్టే ప్రతి పనిలో మోదీ ప్రేమ, సహకారం, ఆశీర్వాదాలు కావాలి...’’ అని కేసీఆర్ కోరారు. ప్రధాని ఆశీస్సులుంటే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ అవుతుందని.. తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
‘మోదీ’ అంటేనే సంతోషం: దత్తాత్రేయ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ అంటేనే సంతోషం’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ ప్రజలు మాత్రం స్థిరమని, ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసమే పనిచేయాలని సూచించాఉ. గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా తెలంగాణ బీడు భూముల్లో పారేలా చేయాలని ప్రధానిని ఆయన కోరారు.
చిందేసిన ‘రసమయి’
కోమటిబండ సభావేదికపైకి ప్రధాని, ప్రముఖులు రాకముందు తెలంగాణ సాంస్కృతిక సారథి రసమ రుు బాలకిషన్ ఆధ్వర్యంలో కొనసాగిన ఆటాపాటా సభికులను ధూంధాంలో ముంచెత్తాయి. రసమరుు కూడా చిందేసి వారిని ఉత్సాహపరిచారు. చిన్నీ నా బతుకమ్మా, పచ్చపచ్చని పల్లె.. పచ్చాని పల్లే, మావురాల ఎల్లమ్మ వంటి పాటలను తెలంగాణ పథకాలపై తమదైన శైలిలో పాడారు. కాగా, యాంకర్లు తీన్మార్ సత్తి, సావిత్రిలు తమదైన శైలిలో సభికులను ఆకట్టుకున్నారు. తమ సరదా సంభాషణతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
అత్యుత్తమ విధానాలతో ముందుకెళుతున్నాం
టీఎస్ ఐపాస్ ద్వారా అత్యుత్తమ పారిశ్రామిక విధానం రూపొందించామని సీఎం కేసీఆర్ చెప్పారు. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా తమ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఐటీ రంగంలో దేశంలో ప్రథమ స్థానానికి చేరుకోవడానికి తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని.. సంక్షేమ కార్యక్రమాల కోసం ఏటా రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
వేదికపై ఎవరెవరు?
ప్రధాని మోదీ ప్రసంగించిన ప్రధాన వేదిక మీద గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్‌కుమార్, పీయూష్ గోయల్, సురేష్‌ప్రభు, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి కూర్చున్నారు. పక్కనే ఉన్న మరో వేదికపై మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు.
ప్రధాని తెలుగులో.. సీఎం హిందీలో!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మిషన్ భగీరథ వేదికపై విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీని ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ పూర్తిగా హిందీలో ప్రసంగించగా, ప్రధాని మాత్రం కొన్ని పదాలు తెలుగులో మాట్లాడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘సోదర సోదరీమణులారా తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తెలుగులో మాట్లాడారు. ఆయన మాటలకు సభికుల నుంచి భారీ స్పందన లభించింది.
ఇక 17 నిమిషాల పాటు ప్రసంగించిన సీఎం మాత్రం ఒకటి రెండు వాక్యాలు మినహా హిందీలోనే మాట్లాడితన వాక్చాతుర్యంతో మోదీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘మేం మీ ప్రేమ, ఆశీర్వాదం తప్ప అవి కావాలి.. ఇవి కావాలి అని అడగం’ అంటూనే ఐటీఐఆర్, జాతీయ సాగునీటి ప్రాజెక్టు, ఎయిమ్స్ కావాలని కోరారు. మధ్యాహ్నాం 2.59 గంటలకు హెలిప్యాడ్ దిగిన మోదీ అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్‌లో కోమటిబండ గుట్ట మీదికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ‘మిషన్ భగీరథ’ పైలాన్‌ను సీఎంతో కలసి ప్రధాని ఆవిష్కరించారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనుల తీరు, ప్రాముఖ్యాన్ని వివరించే ఫొటో ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. కేసీఆర్ దగ్గరుండి మరీ ప్రతీ చిత్రాన్ని మోదీకి చూపిస్తూ మిషన్ భగీరథ పథకం అంకురార్పణ జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.
సాదాసీదాగా కేటీఆర్
మోదీ సభలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సాదాసీదాగా వ్యవహరించారు. మోదీ ప్రసంగించే వేదికపైకి వెళ్లకుండా స్టేజీకి ఎడమవైపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలకు కేటాయించిన వేదికపై కూర్చున్నా రు. కేటీఆర్‌తో పాటు మంత్రులు పోచారం, జూ పల్లి, తుమ్మల కూర్చున్నారు. జనం తాకిడితో మంత్రులకు సైతం ఇబ్బందులు తప్పలేదు.
ప్రధానికి నెమలి సింహాసనం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కోమటిబండకు వచ్చారు. ఐదుగురు కేంద్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కలసి గుట్టపైకి వెళ్లారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకు ముందే అక్కడ నిర్వహించిన సుదర్శన యాగం భస్మ ప్రసాదాన్ని అందించారు. అనంతరం ప్రధాని మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించి... నల్లా నుంచి నీటిని విడుదల చేశారు.
తర్వాత మిషన్ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తర్వాత బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక సభలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, ప్రభాకరరెడ్డి ప్రధాన వేదికపై ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేశాక, సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనంతరం ప్రధాని మోదీ 36 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రసంగం పూర్తయ్యాక ప్రధానిని సీఎం కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, తలపాగా పెట్టి, నెమలి సింహాసనాన్ని కానుకగా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ధన్యవాదాలతో సభ ముగిసింది.